టిక్‌టాక్ యూజర్ల విజయం.. నిషేధం ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ యూజర్ల విజయం.. నిషేధం ఎత్తివేత

April 24, 2019

సరదాలమారి టిక్‌టాక్ యాప్ యూజర్లకు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. నిషేధాన్ని ఎత్తేసింది. దీన్ని బ్యాన్ చేయడంతో యూజర్ల ముఖాలు వాడిపోయాయి. కొంతమందైతే జీవితంలో విలువైనదేదో పోగొట్టుకున్నంత దిగులు పెట్టుకున్నారు. కొందరైతే తమకు ఈ యాప్ మంచి మనోల్లాసాన్ని ఇస్తోంది.. దీనిని బ్యాన్ చెయ్యడం మంచిపని కాదని అన్నారు. అయితే వారందరి మనోవేదనను అర్థం చేసుకున్నట్టుంది మద్రాస్ హైకోర్టు.

Madras high court lifts TikTok ban in India, in boost to ByteDance

గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు నుంచి మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వచ్చింది కేసు. 2019, ఏప్రిల్ 24వ తేదీన వాదనలు విన్న న్యాయస్థానం.. టిక్‌టాక్ యాప్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించమని.. 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించకుండా కొత్త చర్యలు చేపడతాం అని చెప్పటంతో మద్రాస్ హైకోర్టు బ్యాన్ సడలించింది.

అంతేగాకుండా మరికొన్ని నియమాలు పెట్టింది. అశ్లీలం, అసభ్యకరమైన వీడియోలు అప్‌లోడ్ కాకుండా చూడాలని, లేనిపక్షంలో మళ్లీ చర్యలు తీసుకుంటామని చెప్పింది. దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్‌లోకి అప్‌లోడ్ కాకుండా కంపెనీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఇన్వెస్టర్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ కోర్టుకి వివరించింది. గతంలో ఈ యాప్ పై మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. అప్పుడు గూగుల్, యాపిల్ తమ ప్లేస్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించాయి. నిషేధం ఎత్తివేయడంతో మళ్ళీ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా త్వరలోనే నిషాధాన్ని ఎత్తివేయాలని టిక్‌టాక్ యూజర్లు కోరుతున్నారు.