కెమెరా ఆర్డర్ చేస్తే.. రాళ్ళు డెలివరీ - MicTv.in - Telugu News
mictv telugu

కెమెరా ఆర్డర్ చేస్తే.. రాళ్ళు డెలివరీ

April 16, 2019

ఆన్‌లైన్ షాపింగ్ మోసం మరొకటి వెలుగు చూసింది. ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కెమెరా ఆర్డర్ చేసిన వ్యక్తికి రాళ్లు రావడంతో సదరు వ్యక్తి విస్మయానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే… వనపర్తిలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్ అనే వ్యక్తి రూ.48,990 విలువైన కెమెరాను ఆర్డర్ చేయగా రెండు పెద్ద బండరాళ్లు పార్శిల్‌లో వచ్చాయి. ఈ నెల 11న జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్‌ డిజిటల్‌ కెమెరా కోసం ఆర్డర్ పెట్టాడు.

సోమవారం అతనికి ఇన్‌‌స్టాకార్డ్ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా పార్సిల్‌ అందింది. డబ్బు మొత్తం చెల్లించిన తరువాత పార్శిల్‌ను తెరచి చూడగా, రెండు నల్లని రాళ్లు కనిపించడంతో యాదిసాగర్ అవాక్కయ్యాడు. తనకు పార్శిల్ తెచ్చిచ్చిన డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా, బాక్స్‌లో ఏముందన్న విషయమై తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలనీ యాదిసాగర్‌కు సూచించారు. యాదిసాగర్ ఫిర్యాదును తీసుకున్న ఫ్లిప్‌కార్ట్, తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని వారం రోజుల్లో తేలుస్తామని తెలిపారు.