దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ కన్నుమూత

February 22, 2019

KODI.

టాలీవుడ్‌లో కోలుకోని విషాదం నెలకొంది.  ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. శ్వాసకోశ వ్యాధితోపాడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తీవ్ర అస్వస్థకు గురై గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత నెమ్మదించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టింది. 60వ పడిలో ఉన్న ఆయన కొన్నాళ్ల కిందట పక్షవాతంతోనూ బాధపడ్డారు.

కథ, కథనంలో తనదైన ముద్ర వేసి, అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించిన కోడి రామకృష్ణ ఎన్నో సక్సెస్‌ఫుల్  చిత్రాలు తీశారు. ‘ముద్దుల మావయ్య’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘మువ్వగోపాలుడు‘, ‘అంకుశం’, ‘ఆహుతి’, ‘పెళ్లి’ ‘అమ్మోరు..’, ‘అరుంధతి’ వంటి హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపొందినవే. 2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘నాగహారవు’ ఆయన చివరి సినిమా. తెలుగులో 2014 నాటి అవతారం ఆయన చివరి మూవీ.  ఆయన తీసిన చాలా సినిమాల్లో గ్రామీణ మధ్యతరగతి జీవితాలకు, కాస్తా సరసం, మసాల జోడించి జనరంజకంగా తీర్చిదిద్దడం కనిపిస్తుంది. శతాధిక చిత్రాల దర్శకుడైన రామకృష్ణ సినీపరిశ్రమకు పెద్దదిక్కుగానూ ఉండేవారు.  ఆయన తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు తీశారు. 

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన రామకృష్ణ.. దాసరి నారాయణరావు వద్ద శిష్యరికం చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి దాదాపు అందరు అగ్రహీరోలతో, మాధవి, విజయశాంతి, భానుప్రియ వంటి తారలతో ఆయన సినిమాలు తీశారు. సుమన్, భానుచందర్ వంటి ఎందరినో ఆయన వెండితెరకు పరిచయం చేశారు.  భారతీయ చలన చిత్ర రంగంలో అత్యధికంగా గ్రాఫిక్స్ , స్పెషల్ ఎఫెక్ట్స్ తో సినిమాలు తీసింది ఆయనే. గ్రాఫిక్స్‌తోనే అమ్మోరు, అరుంధతి హిట్టయ్యాయి. అయితే గ్రాఫిక్స్ తోనే వచ్చిన ‘అంజి’, దేవీపుత్రుడు వంటివి మెప్పించలేకపోయాయి.  

అవార్డులు.. 
2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. శత్రువు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు  దక్కింది.