నింగికెగసిన అతిపెద్ద విమానం..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నింగికెగసిన అతిపెద్ద విమానం..(వీడియో)

April 14, 2019

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత బరువైన విమానం స్ట్రాటోలాంచ్‌.. ట్రయిల్ రన్‌లో భాగంగా శనివారం తొలిసారి నింగికెగసింది. దాదాపు 2,26,800 కిలోల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు ఏకంగా 117 మీటర్లు. కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే విమానాశ్రయం నుంచి ఈ విమానం తొలిసారి ఎగిరింది. గంటకు 304కి.మీ వేగంతో ఎగిరిన ఈ విమానం దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో స్థాపించిన స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది.

ఈ విమానాన్ని గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి తద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించారు. భూమి నుంచి రాకెట్లను ప్రయోగించి జరిపే ప్రయోగం కంటే ఇది సులభతరమైనదేగాక.. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు ఈ విమానం కలిగిఉంది. దీనిని గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. ఈ విమానం విజయవంతంగా ఎగరడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ విమానం ఎగరడానికి చాలా పెద్ద రన్‌వే కావాల్సి ఉంటుంది. మరిన్ని పరీక్షల అనంతరం పూర్తి స్థాయి వినియోగానికి దీనికి అనుమతులు లభించనున్నాయి. అన్నీ సజావుగా సాగితే వచ్చే సంవత్సరానికి ఇది తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.