వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆదివారం నాడు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం పులివెందుల నుండి కడపకు వైఎస్ భాస్కర్ రెడ్డి వచ్చారు. కడప సెంట్రల్ జైలు వద్ద గెస్ట్ హౌస్ లో వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈ కేసును విచారించే విచారణ అధికారి అందుబాటులో లేనందున ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విచారణ ఎప్పుడు అన్నది మళ్ళీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పారన్నారు.
ఆ లెటర్‌లో అన్ని విషయాలు!!
“సీబీఐ విచారణ కోసం ఇవాళ పిలిచారు. ఆరోగ్యం సహకరించకపోయినా విచారణకు వచ్చాను. సీబీఐ అధికారులు అందుబాటులో లేరు. మరోసారి నోటీసు ఇచ్చి పిలుస్తామన్నారు. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా. నన్ను అరెస్టు చేసుకుంటే చేసుకోండి. ఈ కేసు పరిష్కారం కావాలంటే ఆ లెటర్ గురించి తెలుసుకోవాలి. ఆ లెటర్ గురించి తెలిస్తే.. అసలు విషయం బయటకు వస్తుంది. లెటర్ లేకుండా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసును పూర్తి చేయలేదు.” అని వైఎస్ భాస్కర్ రెడ్డి అన్నారు.
విచారణ అధికారి ఎందుకు రాలేదు?
గతంలో కూడా సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని కోరారు. దీంత వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వైఎస్ భాస్కర్ రెడ్డి తనయుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. తండ్రీ కొడుకులను రెండు రోజుల వ్యవధిలోనే సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. కానీ ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించలేదు ఈ కేసును విచారించే విచారణ అధికారి కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కు రాలేదు. విచారణ అధికారి ఏ కారణాలతో రాలేదనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
టార్గెట్ చేస్తున్నారు..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనను లక్ష్యంగా చేసుకొని సీబీఐ విచారణ సాగుతుందని ఆయన ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు లీకులు ఇస్తున్నారని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రెండు రోజుల క్రితం విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు.