అలకల్లేవ్..బుజ్జగింపుల్లేవ్...జంపింగ్ జపాంగ్ ట్రెండ్ మారింది బాసూ..! - MicTv.in - Telugu News
mictv telugu

అలకల్లేవ్..బుజ్జగింపుల్లేవ్…జంపింగ్ జపాంగ్ ట్రెండ్ మారింది బాసూ..!

October 22, 2022

New Trend In Telagana Politics

అలకల్లేవ్..అనుచరులతో మీటింగుల్లేవ్.. సిద్ధాంతాలు గిద్దాంతాలు జాన్తా నై. వేసేయ్ కర్చీఫ్…కప్పేయ్..కండువా… పూటకో మాట.. పార్టీకో తీరు. ఉదయం ఓ పార్టీ..సాయంత్రం మరో పార్టీ. ఉప ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్‌ల జోరు. ఏ పార్టీ చూస్తే ఏమున్నది సమస్తం వలసల పర్వమే. ఎన్నికలు వస్తేనే ఎజెండా గుర్తుకొస్తుంది. అదీ పార్టీ లైన్ కాదు.. పొలిటికల్ లైఫ్ కోసం పర్సనల్ ఎజెండా. కమిట్‌మెంట్ కంటే కండువా మార్చే పొలిటికల్ ఫిట్‌మెంటే ఇంట్రెస్ట్. ఎన్నిరోజులైంది పార్టీ మారి,ఎందుకు మారాం… మళ్లీ ఎందుకు మారబోతున్నామో.. తిరిగి తిరిగి సొంత పార్టీకి వెళ్లాల్సిన అవసరం పై వారికి క్లారిటీ ఉండదు. అవతలి పార్టీ పెద్దల నుంచి ఫోన్ వస్తే చాలు ఎగిరి గంతేస్తారు.

ఆఫర్ దొరికితే వాలిపోతారు

మంచి వాక్చాతుర్యం. ప్రజల్ని ఆకట్టుకునే గళం. సమస్యలపై స్టడీ చేసి మరీ మాట్లాడుతారు. మీడియా మైక్ ల ముందు పొలిటికల్ మ్యూజింగ్స్ చూపిస్తారు. ప్రత్యర్థులపై వీర ఆవేశంలో విరుచుకుపడుతారు. అధిష్ఠానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేస్తారు. పార్టీలో ప్రయారిటీ వారికివారే కల్పించుకుంటారు. కాలం కలిసి రాలేదంటే క్షణం ఆలోచించరు.కండువా మార్చే పనిలో పడతారు. అదిరి ఆఫర్ దొరికితే చాలు ప్రత్యర్థి పార్టీలో వాలిపోతారు.

జంపింగ్ ట్రెండ్ మారింది బాసూ

గతంలో పార్టీలు మారాలాంటే ఆర్నెళ్లుగా ఆలోచించేవారు. అనుచరులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకునేవారు. పార్టీ మారితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని వాకబు చేసేవారు. మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ సిద్ధపడేవారు. వెళ్లే ముందు ఆఖరి ప్రయత్నంగా తమ ప్రతిపాదనను హైకమాండ్ ముందు ఉంచేవాళ్లు. అధిష్టానం ఒప్పుకోకపోతే అలకలు ఉండేవి. బుజ్జగింపులు మొదలయ్యేవి. ఇవేవి వర్కౌట్ కాకపోతే లాస్ట్ ఆప్షన్ గా జంప్ అయ్యేవాళ్లు.కానీ ఇప్పుడు జంపింగ్ ట్రెండ్ మారింది. ఆఫర్లతో ఫోన్ వస్తే చాలు ముందు వెనకా ఆలోచించకుండా కండువా మార్చేస్తున్నారు.

అన్ని పార్టీల్లో ఇంతే…

వలసలకు ఏ పార్టీ అతీతం కాదు. అన్ని పార్టీల్లో ఇలాగే కొనసాగుతుంది. ఒకరిద్దరు పెద్ద లీడర్లు తప్పితే మిగతా వాళ్లంతా నెలల గ్యాపులోనే రెండు, మూడు పార్టీలు మారిపోతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియకుండా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అప్పటిదాకా గొప్పగా కనిపించిన నేతలు, విధానాలు, సిద్ధాంతాలు మరిచిపోతారు. ఒప్పులు తప్పులుగా…తప్పులు ఒప్పులుగా కనిపిస్తాయి. ఎవరెస్ట్ ఎక్కించిన నేతల్ని ఉన్నట్టుండి కిందపడేస్తారు. సామాజిక అంశాల్ని తెరపైకి తెస్తారు. ఆ పార్టీలలో తమ సామాజిక వర్గాలకు అస్సలు ప్రాధాన్యత లేదని బాంబ్‌లు పేలుస్తారు. అబద్ధాలు అలా వర్షం చినుకుల్లా కురిపిస్తారు. పార్టీలో ఉన్నప్పుడు ఏనాడు వీటి గురించి చర్చించరు. అధినేత దృష్టికి తీసుకెళ్లరు. పార్టీ మారాక మాత్రం ఒంటికాలుపై లేస్తారు.

New Trend In Telagana Politics

గాలివాటం రాజకీయం

గాలి పటం.. గాలి ఎక్కడ వీస్తే అక్కడ వెళ్తుంది. గాలి వీచే కొద్ది పైకి వెళ్తోంది.ఒకవేళ గాలిపటం తెగితే ఇక అంతే. ఎంత అతికించినా కష్టమే. ఎప్పుడు తెగి కిందపడుతుందో తెలియదు. ఇప్పుడు రాజకీయం..గాలివాటంలా నడుస్తోంది. జంపింగ్ జపాంగ్ లు ఎక్కడ స్థిరంగా ఉండరు. కొందరు ఎక్కడ కేరీర్ మొదలు పెట్టారో అక్కడికే వచ్చి ఆగుతున్నారు.

ఉప ఎన్నిక వేళ…వలసల పర్వం

ఎన్నికలు వస్తే వలసల పర్వం షురూ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఇది ఊపందుకుంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీ..బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి షెటిల్ సర్వీసు నడుస్తుంది. లీడర్లు ఉదయం ఓ పార్టీ..సాయంత్రం మరో పార్టీలో ఉంటున్నారు. గల్లీ లీడర్లు అయితే మూడు పార్టీలను తిరిగేస్తున్నారు. చోటా,మోటా లీడర్లూ ఇంతే. అసెంబ్లీ ఎన్నికలు సమయం తక్కువ ఉందని వెనుకా ముందు ఆలోచించకుండా పార్టీల గోడ దూకేస్తున్నారు. మునుగోడ బై పోల్ కు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. బీజేపీలోకి వెళ్లిన లీడర్ల అందరినీ వెనక్కి రప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఓ వెలుగువెలిగిన స్వామిగౌడ్ , దాసోజు శ్రవణ్ తోపాటు బూడిద బిక్షమయ్య గౌడ్ బీజేపీలోకి వెళ్లి..నెలల తిరగాక ముందే కారు లిఫ్ట్ తీసుకున్నారు. అటు బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వీళ్లే కాదు చాలా మంది నేతలు ఇలాగే పార్టీలు మారుతున్నారు. వెళ్ళే ముందు అలకల్లేవ్ ..బుజ్జగింపుల్లేవ్..అనుచరులతో సమావేశాలూ అసలే పెట్టలే..

వలసల్ని ప్రజలు ఎలా చూస్తున్నారు..?

పెద్దలీడర్లు తప్ప మిగతా వారి వలసల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదు.. ఆ పూట చర్చించుకుని వదిలేస్తున్నారు. ఉదయం ఓ పార్టీ..సాయంత్రం మరో పార్టీలో ఉన్న వారిని చూసి నవ్వుకుంటున్నారు. నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. ఏం చేస్తాం…లే .జంపింగ్ జపాంగ్ ట్రెండ్ మారింది బాసూ…ఎవరి లెక్కలు వారివి..!

 

గులాబీ గూటికి దాసోజు, స్వామిగౌడ్.. వీడియో