అలా ఐతే సెమీస్‌కు పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

అలా ఐతే సెమీస్‌కు పాక్

November 3, 2022

Pakistan keeps alive its T20 World Cup dream

సెమీస్ రేసులో టెక్నికల్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కారణంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా నిర్ణయించగా.. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) అర్ధశతకాలతో ఆదుకున్నారు.ఇద్దరికి తోడుగా మహమ్మద్ హారిస్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు 28), మహమ్మద్‌ నవాజ్ (22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28) రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జ్ నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్, రబడా, ఎంగిడి, షంసి తలో వికెట్‌ తీశారు.

భారీ లక్ష్యచేధనలో సౌతాఫ్రికా తడబడింది. 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం రూపంలో అంతరాయం కలిగింది.. ఆ తర్వాత వర్షం తగ్గడంతో డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం 14 ఓవర్లలో 142 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్రికా జట్టు ఛేదించాల్సి వచ్చింది. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోతూ సౌతాఫ్రికా టీం 9 వికెట్లకు 108 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3 వికెట్లు, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తేడాతో రాణించారు. బాబర్ సేన సెమీస్ చేరాలంటే.. ఆదివారం జరిగే మిగతా జట్ల మ్యాచ్‌లపై ఆధారపడాల్సిందే.

ఇక పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌‌తో‌ తలబడుతుంది. ఈ మ్యాచ్‌ నవంబర్ 6వ తేదీన జరుగుతుంది. ఇందులో పాక్ విజయం సాధించడమే కాదు.. నెట్ రేట్‌ కూడా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే టీమిండియా జింబాబ్వే చేతుల్లో ఓడిపోవాలి. మరోవైపు దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ భారీ విజయాన్ని నమోదు చేయాలి. ఇవన్నీ జరిగితేనే పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుతుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.