ఆర్యవైశ్యులు నన్ను క్షమించాలి : జీవితా రాజశేఖర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్యవైశ్యులు నన్ను క్షమించాలి : జీవితా రాజశేఖర్

May 19, 2022

రాజశేఖర్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో తాను ఆర్యవైశ్యుల గురించి తప్పుగా మాట్లాడి ఉంటే తనను క్షమించాలని జీవితా రాజశేఖర్ అన్నారు. కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈవెంట్‌లో యాంకర్ ‘మీ ఇద్దరు కూతుళ్లలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు’? అని అడిగిన ప్రశ్నకు జీవితా బదులిస్తూ ‘ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. శివానీ మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. ఒక్క పైసా ఖర్చుపెట్టాలన్నా ఆలోచిస్తుంది. దానిది కోమటిదాని లెక్క. డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులానికి పిసినారితనం ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ విమర్శలపైనే జీవితా రాజశేఖర్ తాజాగా వివరణనిచ్చారు. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేసే ఆర్యవైశ్యుల గురించి కోమటోళ్ల లెక్క అనే నానుడిని ఎప్పటినుంచో వాడుతున్నారని, తాను కూడా ఆ ఉద్దేశంతో మాట్లాడానని వివరించారు. తనకు ఆర్యవైశ్యులంటే ఎంతో గౌరవముందన్నారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఇదికాక, తన కూతురు ఎవరితోనో లేచిపోయిందని మీడియాలోని కొందరు దష్ప్రచారం చేస్తున్నారని జీవితా ఆరోపించారు. ఇటీవల ఓ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్తే దాన్ని కొందరు మరోలా అర్ధం చేసుకొని తమ కూతుళ్ల గురించి తప్పుగా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. గరుడవేగ సినిమా కోర్టులో ఉందని, తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడించారు.