రాష్ట్రంలో కుల ప్రభావిత రాజకీయాలు ఆపాలనే ఉద్దేశంతోనే గతంలో బీజేపీతో, టీడీపీతో కలిశామని, కానీ, ఈరోజు వైసీపీ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం చాలా బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో గుణం కాకుండా కాదు.. కులం చూస్తున్నారని, ఇదో విచ్ఛిన్నకరమైన ధోరణి అన్నారు. కోనసీమ అల్లర్లను బహుజన సిద్ధాంతంపై, బహుజన ఐక్యతపై దాడిగా జనసేన చూస్తోందన్నారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ అందరూ కుల ప్రభావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మన దేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందన్న పవన్.. మనమంతా ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నామని తెలిపారు. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని చెప్పారు. మనమేమో నిజాయతీగా ఉండాలి… కానీ అవినీతి, దాడులు చేసే వారి పాలనలో బతకాలి. ఈ దేశ పౌరుడిగా నాకు ఇబ్బంది కలిగించే విషయమని పవన్ పేర్కొన్నారు.