బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కాగా.. గత కొంత కాలంగా సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఇవాళ మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు. మొత్తంగా అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలో మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే నెంబర్ 97లో ఒక ఎకరం భూమి.. మొత్తం 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైందని తేల్చారు. పంచనామా అనంతరం 65 మంది అసైనీలకు పట్టదార్ పాస్ పుస్తకాలు, ఇతర యాజమాన్య పత్రాలను అందించారు. దీంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు.
బాధిత రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కబ్జా చేసి నిర్మించిన షెడ్లను కోర్ట్ ఆదేశాలతో ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు. ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారని , 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారని ఎంపీ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు చేసిన విచారణలో భూ ఆక్రమణ నిజమేనని తేలింది. అది ప్రభుత్వ భూమి అని అధికారులు గుర్తించారు. 30 ఏళ్ల కింద ఇచ్చిన ప్రభుత్వ భూమిని ఈటల లాక్కున్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డును కూడా కబ్జా చేశారు.దీనిపై హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలన్నారు.