ఈ దృశ్యం చూస్తే నోట మాట రాదు... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దృశ్యం చూస్తే నోట మాట రాదు…

May 25, 2017

గుండెల్ని పిండేసే దృశ్యం ఇది. రాయిలాంటి మనస్సు కన్నీరు రాల్చాల్సిందే..ఏ తల్లీకి రాకూడని కష్టం.మృత్యువుతో పోరాడుతూ బిడ్డ ఆకలి తీర్చాలనే ఓ అమ్మ చివరి ప్రయత్నం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో బుధవారం ఉదయం రైలు పట్టాల పక్కన ఓ వివాహిత మృతదేహం పడి ఉంది. పక్కనే ఓ ఏడాది వయసున్న చిన్నారి ఏడుస్తున్నాడు. తల్లి చనిపోయిందన్న సంగతి కూడా ఆ చిన్నారికి తెలియదు. అందుకే ఆకలితో ఏడ్చి ఏడ్చి అలసి… చివరకు తల్లి పాలను తాగేందుకు ప్రయత్నించాడు. అమ్మ కళ్లు మూసుకుందేమో అనుకుని ముఖాన్ని తాకుతూ ప్రయత్నించాడు. ఆ చిన్నారికి ఏం తెలుసు తన తల్లి చనిపోయిందని… ఇక ఎప్పటికీ కళ్లు తెరవలేదని….
రైల్వే ట్రాక్ పక్కన పడిపోయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆమె స్పృహలో ఉంది. తను చనిపోతూ కూడా బిడ్డ ఆకలి తీర్చాలనుకుంది. కానీ కాలం ఆ చిన్నారిని ఒంటరి చేసింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని, బిడ్డను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో జరిగిన మరో ఘటన మానవత్వ మనుగడనే ప్రశ్నిస్తోంది. బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు. ఏ ఒక్కరూ 10 రూపాయల అడ్మిషన్ ఫీజు కట్టకపోవడమే ఇందుకు కారణం. చివరికి ఓ వార్డ్ బాయ్ ఆకలితో ఆ బిడ్డ పడుతున్న వేదన చూడలేక పది రూపాయలు చెల్లించాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. ఆ వివాహిత ఎవరో తెలియలేదని, ఘటనా స్థలికి కొద్ది దూరంలో దొరికిన పర్సు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=WOFRGtFw9fU