కారులో దొరికిన 5 కోట్లు నావి కావు..వైకాపా ఎమ్మెల్యే రాంబాబు - MicTv.in - Telugu News
mictv telugu

కారులో దొరికిన 5 కోట్లు నావి కావు..వైకాపా ఎమ్మెల్యే రాంబాబు

July 16, 2020

 

ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని గుమ్మిడిపూండి చెక్ పోస్టు వద్ద ఈరోజు పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.5.27 కోట్ల నగదు పట్టుబడిన విషయం తెల్సిందే. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ ఫార్చూనర్ కారుపై గిద్దలూరు వైపాకా ఎమ్మెల్యే అన్న రాంబాబు స్టిక్కర్ ఉంది. దీంతో ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ వాహనంపై రాంబాబు స్టిక్కర్ ఉన్నప్పటికీ దాని రిజిస్ట్రేషన్ మాత్రం తెలంగాణలో జరిగింది. రాంబాబు మాత్రం ఆ కారుకి తనకు సంబంధం లేదని చెబుతున్నారు. వాహనంపై తన స్టిక్కర్ ఉండటం గురించి ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దీనిపై తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. చెన్నైలోని ఐటీశాఖ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు.

 

అయితే కొందరు ఈ కారుకు వైపాకా మంత్రి బాలినేనికి ముడిపెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. పట్టుబడ్డ డ్రైవర్ ఒంగోలు వ్యక్తి కావడంతో ఆ నగదు తనదిగా ప్రచారం చేస్తున్నారని మంత్రి బాలినేని వాపోయారు. దీనిపై వైపాకా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందిస్తూ..దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ నగదును మంత్రి బాలినేని కుమారుడే తరలిస్తున్నారని మరో టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. ఈ డబ్బు తనదేనంటూ ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించడంతో ఈ మొత్తం ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ నగదు వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీకి, ఏ నేతకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. సరైన ఆధారాలు చూపి నగదు విడిపించుకుంటామని వెల్లడించారు.