Home > క్రీడలు > కుంబ్లే ఖేల్ ఖతం..కొత్త కోచ్ వీరూనా,టామ్‌ మూడీనా..!

కుంబ్లే ఖేల్ ఖతం..కొత్త కోచ్ వీరూనా,టామ్‌ మూడీనా..!

కోచ్ అనిల్ కుంబ్లే ఖేల్ ఖతమేనా…టీమిండియాకు కొత్త కోచ్ రాబోతున్నారా…కొత్త కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ఐదుగురు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో ప్రధానంగా టామ్‌ మూడీ, సెహ్వాగ్‌ మధ్య పోటీ ఉండొచ్చు.

టీమిండియాలో కోల్డ్ వార్ ముదిరింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేకు అస్స‌లు ప‌డ‌టం లేదు. ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన‌ప్పటి నుంచే కెప్టెన్‌, కోచ్‌ల మ‌ధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి వీళ్ల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి బీసీసీఐ కూడా ఓ టీమ్‌ను లండ‌న్‌కు ప్ర‌త్యేకంగా పంపించింది. బ‌య‌టికి ఇద్ద‌రి మ‌ధ్యా ఏ గొడ‌వ‌లూ లేవ‌ని బోర్డు చెబుతున్నా.. రాజీ య‌త్నాలు మాత్రం కొన‌సాగిస్తూనే ఉంది. అయితే ఇవేవీ ఫ‌లించిన‌ట్లు లేవు.

చాంపియన్ టోర్నీలో భాగంగా మే 30న భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ 240తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ తర్వాత రోజు ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్‌ కుంబ్లే కొంత సామాగ్రితో వారిని సమీపించాడు. గమనించిన కోహ్లీ వెంటనే మైదానాన్ని వీడాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, కోచ్‌ కుంబ్లేల మధ్య విభేదాలు, ఇక కోచ్‌ పదవి నుంచి కుంబ్లేకు ఉద్వాసన తప్పదన్న వార్తల నేపథ్యంలో మాజీకెప్టెన్‌, క్రికెట్‌ సలహా సంఘం సభ్యుడు సౌరవ్‌ గంగూలీ ఆటగాళ్లతో సమావేశమయ్యాడు.ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లిన భారత జట్టు సభ్యులతో దాదా మాట్లాడాడు. ప్రస్తుత కోచ్‌ కుంబ్లే విషయంలో అభిప్రాయాలను చెప్పాలని వారిని కోరాడు. ఈనెల 20తో కోచ్‌గా కుంబ్లే కాంట్రాక్ట్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, ఆ గడువు బుధవారంతో ముగిసింది. అనూహ్యంగా కోచ్‌ పదవికోసం మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్రసెహ్వాగ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుట్‌, దొడ్డా గణేశ్‌, రిచర్డ్‌ పైబస్‌ దరఖాస్తు చేసుకున్నారు. కొత్త కోచ్‌ ఎంపిక బాధ్యతను గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌ ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా సంఘానికి వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీ అప్పగించింది. కొత్త కోచ్‌ కోసం క్రికెట్‌ సలహా సంఘం ఇంగ్లాండ్‌లోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుత కోచ్‌ హోదాలో కుంబ్లే నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చని తెలుస్తోంది.

Updated : 2 Jun 2017 7:10 AM GMT
Next Story
Share it
Top