భారత మాజీ నౌకాదళాధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని ఆదేశించింది. జాదవ్‌ను ఉరితీయబోమని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని ఐసీజే కోరింది.
46ఏళ్ల జాదవ్‌ను పాక్ ప్రభుత్వం గతేడాది మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ భారత్ ఐక్యరాజ్యసమితిలో అంతర్భాగమైన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పాక్ మిలటరీ కోర్టు తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది. పాక్ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. జాదవ్ భారతీయుడని ఇరుదేశాలు అంగీకరించాయి. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్‌ను కలుసుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చిచెప్పింది. జాదవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. జాదవ్ కేసును విచారించే పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని తేల్చింది.