Mohammed Shami Break Virat Kohli Record In Test Cricket
mictv telugu

కోహ్లీని అధిగమించిన షమీ.. పలు రికార్డులు నమోదు

February 11, 2023

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. స్పిన్నర్ల విజృంభణతో మూడ్రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఇకపోతే ఈ మ్యాచులో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటిలో ముందుగా చెప్పుకోదగ్గది స్టార్ బ్యాటర్ కోహ్లీని వెటరన్ బౌలర్ షమి అధిగమించడం. టెస్టుల్లో కోహ్లీ 24 సిక్సులు బాదగా, షమీ ఈ మ్యాచులో రెండు సిక్సులు బాది మొత్తం 25 సిక్సులతో కోహ్లీని అధిగమించాడు. భారత్ తరపున సెహ్వాగ్ (91) సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 66 సిక్సులు కొట్టాడు. అటు రవీంద్ర జడేజాకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. మొదటి ఇన్నింగ్సులో 46వ ఓవర్ వేయడానికి వచ్చిన జడేజా ఎడమ చేతి చూపుడు వేలికి క్రీమ్ రాసుకున్నాడు. అయితే అంపైర్లకు చెప్పకుండా చేయడంతో ప్రవర్తనా నియమావళి 2.20ని అతిక్రమించినట్టు ఐసీసీ వెల్లడించింది. ఇక రెండో ఇన్సింగ్స్‌లో 91 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్ జట్టు భారత్‌లో భారత్‌పై తన రికార్డును తానే అధిగమించింది. 2004లో 94 పరుగులకు ఆలౌట్ అయి అత్యల్ప స్కోర్ నమోదు చేయగా, ఇప్పుడు 91 పరుగులతో దాన్ని అధిగమించింది. మరోవైపు ఆ జట్టు స్పిన్నర్ నాథన్ లియోన్ ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు తన పేర లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 30 వేల బంతులు వేసిన నాథన్.. ఇప్పటివరకు ఒక్క నోబాల్ వేయకపోవడం గమనార్హం. 12 ఏళ్ల కెరీర్, వందకిపైగా టెస్టులాడిన 35 ఏళ్ల నాథన్.. ఒక్కసారి కూడా క్రీజు దాటకపోవడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు.