యూపీఐ లావాదేవీల్లో సింహభాగం ఆక్రమించిన గూగుల్ పే, ఫోన్ పేలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మరో రెండేళ్లు వీటికి మార్కెట్లో స్వేచ్ఛ కల్పించింది. డిటిజల్ పేమెంట్ల వ్యవస్థలో యూపీఐ లావాదేవీల గుత్తాధిపత్యాన్ని తగ్గించడానికి విధించాలనుకున్న 30 శాతం పరిమితి నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసింది. 2024 డిసెంబర్ వరకు ప్రస్తుతం విధానమే అమలు కానుంది. వేల ఖరీదైన పెద్ద వస్తువుల నుంచి రూపాయి ఖరీదైన చిన్నాచితకా వస్తువుల కొనుగోలు వరకు అందరూ యూపీఐని ఆశ్రయించడంతో వాటిని 30 శాతానికి పరిమితం చేయాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ నిబంధనను తీసుకొచ్చింది. దీన్ని రెండేళ్లు వాయిదా వేయడంతో ఈ రంగంలో గుత్తాధిపత్యం చలాయిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలతో పాటు ఇతర చిన్నాచితకా యూపీఐ పేమెంట్ వ్యవస్థలకు ఊరట దక్కింది. దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీను 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం 2020లోనే నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండినా దశల వారీగా అమలు చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మరో రెండేళ్లు పొడిగించారు.