చేతకానితనంతో త్రిపురలో ఓడిన సిపిఎం - MicTv.in - Telugu News
mictv telugu

చేతకానితనంతో త్రిపురలో ఓడిన సిపిఎం

March 7, 2018

   25 ఏళ్లు  త్రిపురను పాలించిన సిపిఎం ఎందుకు ఓడిపోయింది? బీజేపీ ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నలకు బెలోనియాలో కూలిన లెనిన్ విగ్రహమే సమాధానం. సిపిఎం పార్టీ ఆరోపిస్తున్నట్టు కూల్చింది బీజేపీ కార్యకర్తలు కావొచ్చు. కాకపోవచ్చు. అయితే పాతికేళ్ల మాణిక్ సర్కార్ పాలనపై త్రిపుర ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆగ్రహానికి  మాత్రం వాళ్లు కచ్చితంగా ప్రతినిధులే.

సొంత ఆస్తి లేని ముఖ్యమంత్రి. సిన్సియర్ అండ్ హానెస్ట్ సిఎం, పేదల పెన్నిధి. మాణిక్ సర్కార్ కు ఉన్న ఈ ప్రత్యేకతలేవి సిపిఎం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురాలేకపోయాయి. సంపాదించాలన్న కోరిక మాణిక్ సర్కార్ కు  లేకపోవచ్చు. కాని అక్కడి ప్రజలు మాత్రం తమ బ్యాంక్ అకౌంట్ లలో ఎంతో కొంత బ్యాలెన్స్ ఉండాలనుకున్నరు. మాణిక్ సర్కార్ మచ్చలేని పాలన అందించవచ్చు. కాని ఈ అవినీతి రహిత పాలన తమ బతుకులను మార్చలేకపోయిందన్న ఆవేదన అక్కడి ప్రజల్లో ఉంది. అందుకే బతకలేక బెంగాల్ కు వలసపోయిన ఎంతో మంది త్రిపుర ఓటర్లు తమ కసితీరేలా బీజేపీకి ఓట్లేసారు.  

26 లక్షల మంది ఓటర్లు ఉన్న త్రిపురను గెలవడానికి  బీజేపీకి పెద్ద కష్టం కాలేదు. దేశంలోనే ధనవంతమైన పార్టీ, నోటి తో కాకుండా నోట్లతో మాట్లాడింది. ఆ పార్టీ ఈపార్టీ అని తేడా లేకుండా అందరు నాయకులను తనవైపు తిప్పుకుంది. ఇదేదో నిన్న మొన్న జరగలేదు. ఇందుకోసం బీజేపీ భారీగానే గ్రౌండ్ వర్క్ చేసింది. సైలెంట్ గా కాదు వైలెంట్ గానే పనిచేసింది. అయితే తన కంటి ముందే ఇదంతా జరుగుతున్నా మాణిక్ సర్కార్ పట్టించుకోలేదు. మోస్ట్ డెమొక్రటిక్ అని చరిత్రలో తన పేరు రికార్డ్ చేయించుకోవడానికి పార్టీనే పణంగా పెట్టాడు.  

ఏం చేసైనా త్రిపురలో కమలాన్ని వికసింపచేయాలని మోడీ అండ్ అమిత్ షా వేసిన ప్లాన్ ను సిపిఎం కనీసం అర్థం కూడా చేసుకోలేకపోయింది. బీజేపీ కి ఉన్నంత అర్థబలం సిపిఎంకు లేకపోవచ్చు. కాని అంగబలంతో ఎదుర్కోవచ్చు. కాని ఆ పని కూడా చేయలేకపోయింది. అధికారంలోకి వచ్చేంత వరకు త్రిపుర సిపిఎం పార్టీలో ఉన్న కరుడుగట్టిన కార్యకర్తలు, పవర్ లోకి రాగానే కాంట్రాక్టర్లుగా మారిపోయారు. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండి వాళ్లు ఏం సంపాదించుకున్నరో ఏమో కాని కామ్రెడ్ల స్వభావాన్ని మాత్రం కోల్పోయారు.  తమపై దాడులు చేస్తున్న బీజేపీని కనీసం ప్రతిఘటించలేక, కార్యాలయాలను స్వఛ్చందంగా అప్పగిస్తున్న ఆ పార్టీ నాయకుల ముఖాలే ఇందుకు నిదర్శనం.

ఏళ్లకు ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీసం తన సిద్దాంతకర్త విగ్రహాన్ని కూడా కాపాడులేకపోవడానికి ఆ పార్టీ అగ్రనేతల చేతకానితనమే కారణం. మారుతున్న ప్రపంచంతో కనెక్ట్ కాలేక, ఈ దేశ సమాజానికి పనికొచ్చేలా పార్టీ భావజాలాన్ని అప్ డేట్ చేసుకోలేక  వాళ్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

పోరాటాలే ప్రాణంగా ఉండాల్సిన పార్టీ,  జన్మహక్కైన ఆ పోరాటాలను మర్చిపోతే ఏమవుతుందో నిన్న బెంగాల్ లో తెలిసింది. ఇవాళ త్రిపురలో కనిపించింది. రేపు కేరళలో కంటిన్యూ అవుతుంది. బీజేపీ మతతత్వాన్ని అడ్డుకుంటామన్న ఆ పార్టీ ఇప్పటికైనా లోపాలను సవరించుకుని ఎర్రజెండాకు మళ్లీ మెరుపు అద్దుకోవాలి.