తల్లిదండ్రులను పట్టించుకోని ఓ కొడుక్కి నాలుగేళ్ల జైలు శిక్షపడింది. ఆ వృద్ధులకు నెలకు రూ.1,800 చెల్లించాలని కోర్టు ఆదేశించినా కొడుకు పట్టించుకోలేదు. దీంతో అతనికి 1,545 రోజుల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇప్పటి వరకు బకాయి పడిన రూ. 49వేలకు చేరడంతో.. సదరు కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది.రాంచోద్భాయ్ సోలంకి(68), జాసుమతి సోలంకి(67)లకు ఇద్దరు కుమారులు కాంతిభాయ్, దయాభాయ్ ఉన్నారు. కొడుకులు తమను పట్టించుకోవడం లేదని, ఆహారం, ఔషధాలు సమకూర్చడం లేదని, బతకడం చాలా కష్టంగా మారిందని తండ్రి సోలంకి 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పాటు విచారణ చేపట్టిన కోర్టు కుమారులిద్దరూ నెలకు రూ.1800 తల్లిదండ్రులకు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
కానీ దయాభాయ్ మాత్రం ప్రతీ నెల తల్లిదండ్రులకు చెల్లించాల్సిన రూ.1800 చెల్లించడం లేదు. అది కాస్తా.. రూ.49,000 అయ్యింది. కాగా తమ కొడుకు తమకు డబ్బులు ఇవ్వడం లేదని రాంచోద్భాయ్ సోలంకి, జాసుమతి సోలంకి మరోసారి కోర్టుకెళ్లారు. దీంతో ఫ్యామిలీ కోర్టు దయాభాయ్కి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.