తెలంగాణ: శుభవార్త..113 ఉద్యోగాలకు ప్రకటన విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: శుభవార్త..113 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

July 28, 2022

 

తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్-1, విద్యుత్ శాఖలో ఐఈ, లైన్‌మెన్‌తోపాటు వైద్యశాఖలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు.

తాజాగా రవాణా శాఖకు సంబంధించిన మరికొన్ని ఉద్యోగాలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయసు, దరఖాస్తుల ప్రారంభం, ఫీజు తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది.

”రవాణా శాఖలో మొత్తం 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు (నెల రోజులు) దరఖాస్తులు చేసుకోవాలి. నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహిస్తాం. దీనిని ఆబ్జెక్టివ్‌ టైప్‌లోనే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తాం. పరీక్షా కేంద్రాలను హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం” అని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

అర్హతలు ఇవే..

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా మూడేండ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. దరఖాస్తుదారులు చెల్లుబాటయ్యే హెవీ మోటర్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ట్రాన్స్‌పోర్ట్‌) పొంది ఉండాలి. పురుషులు కనీస ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతీ 86.3 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. గాలిపీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎత్తు 160 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఛాతీ 83.80 సెంమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి.

ఇక, మహిళలు ఎత్తు 157.5 సెంటీమీటర్లు, ఛాతీ 82.30 సెంటీమీటర్లు ఉండాలి. గాలిపీల్చినప్పుడు ఛాతి 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు ఎత్తు 152.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. ఛాతీ 79.80 సెంటీమీటర్లు ఉండాలి. గాలిపీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి. దరఖాస్తుదారులు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.200, ఎగ్జామ్‌ ఫీజుగా రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఎగ్జామ్‌ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఐదేండ్లు, ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్‌ సర్వీసు పొందిన నాటి నుంచి ఐదేండ్ల పాటు వయో పరిమితి సడలింపు ఉంటుంది.