టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సెలక్టర్ల విరుచుపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీకి తనను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. ధోనీకి ఇచ్చినంత విలువ అంతకన్నా సీనియర్ అయిన తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాడు. ఫామ్‌లో లేకపోయినా ధోనీ ఎంపిక చేసినవాళ్లు తనను ఎందుకు చేయరని భజ్జీ అక్కసు వెళ్లగక్కాడు. అయితే బ్యాటింగ్‌లోనే కాదు అనుభవం, అతని వ్యూహాలు కూడా టీమ్‌కు పనికొస్తాయనే ధోనీని సెలక్ట్ చేసినట్లు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.
“అతను ఫామ్‌లో ఉన్నా లేకపోయినా టీమ్‌లో ఉంటే మిగతావారికి స్ఫూర్తిగా నిలుస్తాడు నిజమే. అతనికి కలిసొచ్చేది అదే. నా విషయంలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు. అతనికిచ్చిన విలువ నాకు ఇవ్వలేదు. నేను కూడా 19 ఏళ్లుగా ఆడుతున్నా. రెండు వరల్డ్‌కప్ లు గెలిచాను. కానీ కొందరికీ ఆ గౌరవం దక్కుతుంది. ఇంకొందరికి దక్కడం లేదు. అందులో నేను ఒకడిని” అని హర్భజన్ కుండబద్ధలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఎంపికలో గంభీర్ లేదా తన పేరును కనీసం చర్చకు కూడా తీసుకురాకపోవడంపై హర్భజన్ గుర్రుగా ఉన్నాడు.
ఐపీఎల్లో 6.48తో ముంబై తరఫున అత్యధిక ఎకానమి రేటు హర్భజన్ పేరిటే ఉంది. అయినా తనను ఫైనల్లో ఆడించకపోవడంపై కూడా భజ్జీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఇలాంటి టోర్నీల్లో ఆడేది ఇండియన్ టీమ్‌కు ఎంపిక కావడానికే అని, అలా జరగనపుడు ప్రయోజనం ఏంటని ప్రశ్నించాడు. అశ్విన్ ఫిట్‌గా లేకపోతేనే నన్ను ఎంపిక చేస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధంగా ఉండాలనే అతనికి ఐపీఎల్ నుంచి రెస్ట్ ఇచ్చారు. కానీ ఒక ప్లేయర్ బాగా ఆడినపుడు అతన్ని గుర్తించాలి. ఇద్దరు ప్లేయర్స్‌కు వేర్వేరు రూల్స్ ఎలా వర్తిస్తాయి అని హర్భజన్ సెలక్టర్ల తీరు మండిపడ్డాడు.