నిషీత్ యాక్సిండెంట్ పై బెంజ్ ఎంక్వైరీ - MicTv.in - Telugu News
mictv telugu

నిషీత్ యాక్సిండెంట్ పై బెంజ్ ఎంక్వైరీ

May 18, 2017


గతవారం జూబ్లీహిల్స్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్‌, అతడి స్నేహితుడు రవిచంద్ర ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని బెంజ్‌ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. బెంజ్ కారులో వెళ్తూ నిషీత్‌ మెట్రో పిల్లర్‌ 36ను వేగంగా ఢీకొని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంజ్‌ సంస్థకు లేఖ రాశారు. కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటో వివరించాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బెంజ్‌ సంస్థ ఇద్దరు ప్రతినిధులను జర్మనీ నుంచి హైదరాబాద్‌కు పంపించిది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నప్పటికీ ప్రాణనష్టం ఎలా సంభవించిదన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆ తర్వాత వీరు ప్రమాదానికి గురైన కారును పరిశీలించి పోలీసులకు నివేదిక సమర్పించనున్నారు. కారు ప్రస్తుతం బోయిన్‌పల్లిలోని బెంజ్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఉంది.
బెంజ్ అత్యాధునిక ఫీచర్లు ఇవే
మెర్సిడెస్‌ జీ 63.. తొలిసారిగా 1970లో తయారైనా కాలానుగుణంగా ఇందులో సౌకర్యాలు, సెక్యురిటీ ఫీచర్లు పెంచుతూ వస్తున్నారు. అత్యధిక వేగంతో వెళ్లేందుకు, రహదార్లు సరిగా లేని ప్రాంతంలోనూ తిరిగేందుకు దీన్ని రూపొందించారు. డిజైన, పనితీరు, టెక్నాలజీ విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ వాహనాన్ని రూపొందించారు. బాడీ తయారీలో గాల్వనైజ్‌డ్‌ స్టీల్‌ని ఉపయోగించారు. ఇది అత్యంత కఠినంగా.. ధృఢంగా ఉంటుంది.
ఈ కారులో అన్ని వైపులా ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో అతి తక్కువ సమయంలో తెరుచుకొని ప్రాణం కాపాడేందుకు తోడ్పడతాయి. ఫ్రంట్‌ ఇంపాక్ట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఓవర్‌ హెడ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ ముందు సీట్లో కూర్చున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ వాహనం తలకిందులుగా పడినా, లేక ఇతర వాహనాలు సైడ్‌ నుంచి ఢీకొట్టినా తల భాగానికి గాయాలు కాకుండా ఓవర్‌ హెడ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ కాపాడుతాయి. సీట్‌ బెల్ట్స్‌ ప్రమాదం జరిగిన సమయంలో మరింత టైట్‌ అవుతాయి. సీటులో వ్యక్తి ముందుకు జారకుండా చేస్తాయి.
స్టెబిలిటీ కంట్రోల్‌ వ్యవస్థ.. వాహనం అతి వేగంగా వెళ్తున్న సమయంలో కంట్రోల్‌ తప్పకుండా చేస్తుంది. ఇంజిన వేగాన్ని అదుపు చేస్తుంది. వేగం విషయంలో డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. వేగం మితిమీరినపుడు వాహనం అదుపు తప్పకుండా బ్రేకులు వేసి.. వేగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇన్ని ఫీచర్లున్నా నిషీత్ ప్రాణాలు మాత్రం దక్కలేదు.