Pakistan: Hindu temple vandalised in Karachi, idols desecrated
mictv telugu

పాక్‌లో దుర్మార్గం… హిందూ ఆలయంపై దాడి, విధ్వంసం..

June 9, 2022

Pakistan: Hindu temple vandalised in Karachi, idols desecrated

పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని కొరంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మరీ మాతా మందిర్‌పై గుర్తు తెలియని దుండగులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో స్థానిక హిందువులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రత్యక్షసాక్షి సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

‘ఆలయంపై దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు. కానీ ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు’ అని సంజీవ్ అనే స్థానికుడు తెలిపారు. వాళ్లెవరో.. ఎందుకు ఆలయంపై దాడి చేశారో తమకు తెలియదన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినట్లు కొరంగి ఎస్‌హెచ్ఓ ఫరూఖ్ సంజ్రనీ ధ్రువీకరించారు. ఐదు నుంచి ఆరుగురు దుండగులు ఆలయంపై దాడి చేశారని.. పరారీలో ఉన్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఘటనాస్థలం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువుల ఆలయాలపై తరచూ దాడులు జరుగుతుండటం స్థానిక హిందూ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.