కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ తన గొంతుతో జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని, ప్రతిభకు అందంతో పని లేదని నిరూపించుకున్న విషయం తెలిసిందే. సరిగమప కొత్త సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన ఆమె తన పాటతో అందరి మనసులను గెలుచుకుంది.‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా, తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు.
This promo ❤#SaReGaMaPa pic.twitter.com/0ALFWDGv0m
— Varshini reddy (@iriseye_here) February 16, 2022
అంతేకాకుండా పార్వతి పాడిన పాట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. లక్షలాది వీక్షకులు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఆ పాటను షేర్ చేశారు. పార్వతి విన్నపానికి డోన్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు. తన పాటతో గ్రామానికి బస్సు వచ్చే విధంగా చేసిన పార్వతికి ఆదివారం లక్కసాగరంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగర్ స్మితతో పాటు గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి, రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.