పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలు ఇవే..! - MicTv.in - Telugu News
mictv telugu

పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలు ఇవే..!

May 26, 2017

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. అసోంలోని తీన్‌సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై ధోలా-సాదియా వంతెన నిర్మించారు. ఇది అసోం రాజధాని దిస్‌పూర్‌కు 540కి.మీ.లు.. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌కు 375 కి.మీ.ల దూరంలో ఉంది.
9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన కారణంగా అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. గతంలో ఈ రెండింటి మధ్య ప్రయాణం ఆరు గంటల సమయం తీసుకునేది. తాజా వంతెనతో గంటకు తగ్గనుంది. ఈ వంతెన కారణంగా ఐదుగంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
రూ. 2,056కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో భారత్‌-చైనా సరిహద్దులోని సైనిక శిబిరాలకు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి ఈ వంతెన అత్యంత కీలకమైనది.
వంతెన ప్రారంభించిన తర్వాత ప్రధాని కారులో ప్రయాణించారు. కాస్త దూరం వెళ్లాక కారు నుంచి దిగి భద్రతను పక్కన పెట్టి కొంతదూరం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి అధికారులతో వంతెన నిర్మాణం గురించి చర్చించారు. కేంద్రంలో మోదీ పాలన విజయవంతంగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వంతెనను శుక్రవారం ప్రారంభించారు. మరో ప్రత్యేకత కూడా ఉంది. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది.