ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగూ (59) గుండెపోటుతో చనిపోయారు. రాత్రి ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు అంథేరీలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రీమా మరణించారు. మరాఠీ రంగ స్థలం నుంచి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రీమా లాగూ తల్లి పాత్రకు పెట్టింది పేరు. దూరదర్శన్ ధారావాహికలతో కెరీయర్ ప్రారంభించిన ఆమె కయామత్ సే కయామత్ తక్ (1988) చిత్రంతో వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రంలో ఆమె జూహీచావ్లా తల్లి పాత్ర పోషించారు. మరాఠీతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రీమా…తనదైన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.
మైనే ప్యార్ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ తల్లిగా నటించింది. హమ్ ఆప్కే హై కౌన్, కుచ్ కుచ్ హోతా హై, హమ్ సాత్ సాత్ హై, కల్ హో నా హో తదితర చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించారు. పాపులర్ టీవీ షో ‘తూ తూ మే మే’, శ్రీమన్ శ్రీమతిలోనూ చేశారు. ప్రస్తుతం రీమా నామకరణ్ అనే సీరియల్లో విలన్ పాత్ర చేస్తున్నారు. మరాఠీ నటుడు వివేక్ లాగూను వివాహం చేసుకున్న రీమా లాగూకు కుమార్తె మృన్మయీ లాగూ ఉన్నారు. రీమా మృతిపట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు. సోషల్‌మీడియా ద్వారా ‘బాలీవుడ్ అమ్మ’నివాళులర్పించారు.