భయపెట్టని దెయ్యం - MicTv.in - Telugu News
mictv telugu

భయపెట్టని దెయ్యం

February 23, 2018

మాస్, సెంటిమెంట్, కామెడీ, కుటుంబ బంధాలు అన్ని కథలను తెరపై చూపించేశారు. ఇక మిగిలింది హారర్ ఒకటే అనే డైలాగ్ సినిమాలో ఒకచోట వినిపిస్తుంటుంది. సరిగ్గా శ్రీకాంత్ కూడా రా..రాతో అదే  దారిని అనుసరించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఒక్క హారర్ కామెడీ తప్ప అన్ని రకాల సినిమాలుచేసేశారు. చివరకు విజయం కోసం రా..రా సినిమాతో హారర్ కామెడీ బాట పట్టారు. ఈ సినిమానైనా తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే  నమ్మకంతో ఎదురుచూశారు. అయితే హారర్ కామెడీ కథతో సినిమా చేశాననే తృప్తి తప్ప శ్రీకాంత్‌కు ఈ సినిమాతో ఏమీ మిగలలేదు.

రాజ్‌కిరణ్(శ్రీకాంత్) ఓ దర్శకుడు. అతడి సినిమాలన్నీ పరాజయాలుగా నిలుస్తుంటాయి. ఆ బాధతో అతడి తల్లి హాస్పిటల్ పాలవుతుంది.  అమ్మ సంతోషంకోసం నాలుగు నెలల్లో ఓ సినిమా తీసి హిట్టు కొట్టాలని నిర్ణయించుకుంటాడు. హారర్ కథతో సినిమా తీయాలని అనుకున్న రాజ్‌కిరణ్ కథ చర్చల కోసం అడవిలో ఓ ఉన్న పాడుబడిన బంగళాకు తన అసిస్టెంట్స్‌తో కలిసి వెళతాడు. అక్కడ నిజంగానే కొన్ని దెయ్యాలుంటాయి.

కానీ అవి మనుషులను చూసిభయపడటంతో తమను ఏం చేయవని అనుకుంటారు. కానీ ఆ భవంతిలో అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో భయటపడలేరనే నిజం ఆ తర్వాత అతడికి అర్థమవుతుంది. తమ కుటుంబానికి ఆప్తులైన వారి చేతుల్లోనే అన్యాయానికి గురై ఆత్మహత్య చేసుకున్న మణివదన(నాజియా), ఆమె కవల చెల్లెల్లు మనుషులపై ద్వేషంతో ఆ భవంతిలో అడుగుపెట్టిన వారిని హతమారుస్తుంటారు. ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడటానికి దెయ్యాలతోనే రాజ్ కిరణ్ సినిమా చేయాలని నిర్ణయించుకుంటాడు. అతడి ప్రయత్నం నెరవేరిందా? అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడా? రాజ్‌కిరణ్ మంచితనం మణివదనలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

 

‘ఒక సినిమా హిట్టయితే అందరూ అలాంటి సినిమాలు తీస్తారేంట్రా..  మనం మాత్రం కొత్త సినిమా చేయాలి, హిట్టు కొట్టాలి’ అని  ఈ సినిమాలో మాటిమాటికి శ్రీకాంత్ చెబుతుంటాడు. హారర్ కామెడీ కథతో శ్రీకాంత్ తొలిసారి సినిమా చేస్తుండటంతో నిజంగానే హిట్టు కొడతాడేమో చిన్న ఆశతో థియేటర్‌లో అడుగుపెట్టినప్రేక్షకులకు సినిమాకు వచ్చి ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు.

తొలి సన్నివేశం నుంచే హారర్ కామెడీ పేరుతోమొదలైన హింస చివరి వరకు సాగుతూనే ఉంటుంది. ‘ప్రేమకథా చిత్రం’ నుంచి ఇటీవలే విడుదలైన ‘ఆనందోబ్రహ్మ’ వరకు తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ కామెడీ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది చిత్రబృందం చేసిన ఈ ప్రయత్నం నిర్మాణ విలువల లేమి, దర్శకుడికి కథపై క్లారిటీ లేకపోవడంతో అగమ్యగోచరంగా మారిపోయింది. తమకు తోచింది దర్శకుడు తీసుకుంటూ వెళ్లిపోయాడు తప్పితే కథ, సీన్ పేపర్ గురించి ఆలోచించనట్లు కనిపిస్తుంది. దెయ్యాలతో ఫుట్‌బాల్, దాగుడుమూతలు, అంత్యాక్షరి పేరుతో వచ్చే కామెడీ సన్నివేశాల్ని చూస్తూ  థియేటర్‌లో కూర్చోవడం సాహసమనే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులపై దాడి చేస్తూనే ఉంటాయి.

ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడి పేరును చిత్రబృందం ఎక్కడా ప్రస్తావించలేదు. చివరకు  టైటిల్ కార్డ్స్‌లో అతడి పేరు వేయలేదు. అందుకు తగినట్లుగానే దర్శకుడు అనేవాడు లేకుండా సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ చిత్రం ఉంది. ఆది అంతం అంటూ లేకుండా సాగిపోతూనే ఉంటుంది. రఘుబాబు,హేమ తదితరులను దెయ్యాలంటూ వింత మేకప్‌లతో వారిని చూపించిన విధానం కృతకంగా ఉంది. 1990 కాలంలో వచ్చిన హారర్ సినిమాలు దీనితో పోలిస్తే నయమేనని అనిపిస్తుంటుంది. చిత్రీకరణ కోసం ఎంచుకున్న బంగళా నేపథ్యంలో వచ్చే గ్రాఫిక్స్ మరి నాసిరకంగా ఉన్నాయి. పతాక ఘట్టాల వరకు కథనేదిలేకుండా టైమ్‌పాస్ చేస్తూ వచ్చి చివరలో మనుషులపై ధ్వేషంతో వారిని వారిని చంపే ఓ ఆత్మ, ఆమెలో మార్పు తెచ్చిన ఓ దర్శకుడు అంటూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో అది పెద్దగా వర్కవుట్ కాలేదు.

విజయం కోసం హారర్ కామెడీ సినిమా చేయాలనే శ్రీకాంత్ ఆలోచన మంచిదే అయినా చాలా ఆలస్యంగా అతడు ఈ కథను ఎంచుకుని ఒకరకంగా తప్పుచేశాడని చెప్పవచ్చు. ఈ తరహా కథాంశాలతో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఒకరకంగా ఇప్పుడు హారర్ కామెడీ  ట్రెండ్ అవుట్‌డేటెడ్ అయిపోయింది. దానికితోడు హారర్ సినిమాను నడిపించే సమర్థుడైన దర్శకుడు,  అభిరుచి గల నిర్మాత లేకపోవడం మైనస్‌గా మారింది. దాంతో శ్రీకాంత్ మరోసారి  నిరాశే మిగిలింది. సినిమాను తన నటనతో సినిమాను నిలబెట్టేందుకు అతడు చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. హీరోయిన్లగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కథకు కీలకమైన మణివదన పాత్రలో నాజియా పూర్తిగా తేలిపోయింది. అనుభవలేమి కారణంగాతడబడింది. పేరుకు సినిమాలో చాలా మంది హాస్యనటులు ఉన్నా ఎవరూ నవ్వించలేకపోయారు. ఉన్నంతలో షకలక శంకర్ ఒక్కడే పర్వాలేదనిపించారు. సినిమాలపై, హీరోలపై అతడు వేసే సెటైర్స్ నవ్విస్తాయి.

నిర్మాణ విలువలు, సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సినిమా కంటే ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని సీరియల్స్ చాలా అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్నాయి.  నిడివి ఎక్కువ కావడం సినిమాకు అవరోధంగా మారింది.

శ్రీకాంత్ లాంటి అనుభవజ్ఞుడైన నటుడు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీలేదు. అతడిపై నమ్మకంతో అడుగుపెట్టేవారిని పూర్తిగా ఈ సినిమా నిరాశపరుస్తుంది.పేరుకు హారర్ కామెడీ అయినా ఇందులో అటు భయపెట్టే సన్నివేశాలు కానీ కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలో కనిపించవు. రా..రాప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసే సినిమా.