మానవత్వం అనే మాటకు ఎంతోమంది ఆదర్శంగా నిలిచారు. నిలుస్తున్నారు. కొంతమంది ఆపదలో ఉన్నవారికి, మరికొంతమంది ఆకలితో అలమటిస్తున్నవారికి, ఇంకొంతమంది ఆర్థికంగా వెనకబడిన వారికి తమవంతు సహాయసహకారాలు అందజేసి, వారికి అండగా నిలబడుతారు.
ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. వింటూనే ఉంటాం. కానీ, ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రం సాటివ్యక్తి పట్ల చూపిన మానవత్వం ప్రస్తుతం అందరి నోటా శభాష్ అనిపించుకుంటుంది. ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కూకట్ పల్లిలో ఓ వ్యక్తి ఎండ వేడిమి తట్టుకోలేక సోమ్మసిల్లి రోడ్డుపై పడిపోయాడు.
దీంతో ఆ రోడ్డుపై నుంచి వెళ్తున్న వారందరు అతడు బాగా తాగి పడిపోయాడు అనుకున్నారు. మరికొంతమంది ఏం బాధ వచ్చిందోనని అనుకుంటూ వెళ్లిపోయారు. ఎవ్వరూ అతనిని పట్టించుకోలేదు. కానీ, సాటి మనిషికి సాయం చేసేందుకు ఓ ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చారు. ఆ వ్యక్తికి సపర్యలు చేసి, అతనికి మెలుకువ వచ్చే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాకుండా అతనికి కావల్సిన డబ్బులు కూడా ఇచ్చారు.
ఈ వీడియోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. కానీ, ఆ వీడియోలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరు అనేది మాత్రం పోలీసులు వివరాలు వెల్లడించలేదు.