రూపాయి కష్టాలు - MicTv.in - Telugu News
mictv telugu

రూపాయి కష్టాలు

May 15, 2017


ఐటీ, ఫార్మా రంగాలకు ‘రూపాయి’ కష్టాలు వచ్చాయి. అటు హెచ్‌1బీ వీసాల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఇటు బలపడుతున్న రూపాయి చుక్కలు చూపిస్తోంది. ఆరు నెలల క్రితం రూపాయి విలువ పడిపోతే ఎగుమతులపై ఆధారపడిన కంపెనీలు బాగా ఆర్జించాయి. ఇప్పుడు ఉన్నట్టుండి రూపాయి బాగా బలపడుతోంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 5.6శాతం పెరిగింది. ఇది ద్రవోల్బణం తగ్గేందుకు ఉపయోగపడుతుండగా.. మరోపక్క ఎగుమతులపై ఆధారపడిన కంపెనీలకు సవాళ్లు విసురుతోంది. ముఖ్యంగా ఐటీ , ఔషధ పరిశ్రమలు విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలు, అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలతో అవస్థలు పడుతున్నాయి. టీసీఎస్‌ కూడా రూపాయి ప్రభావానికి లోనైంది. ఈ విషయాన్ని గతనెలలో ఫలితాల ప్రకటన సందర్భంగా టీసీఎస్‌ సీఈవో రాజేష్‌ గోపీనాథన్‌ అంగీకరించారు. ఇప్పటికే బలపడుతున్న రూపాయిని కట్టడి చేయటం కోసం ఆర్‌బీఐ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది ప్రమాద హెచ్చరికలను ఎగురవేస్తోంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలు దాదాపు 90శాతం ఆదాయాన్ని విదేశాల నుంచే పొందుతుండగా.. సన్‌ ఫార్మా, లుపిన్‌ 70శాతం కంటే ఎక్కువ ఆదాయాన్ని ఎగుమతుల ద్వారా పొందుతున్నాయి.

రూపాయి పెరుగుదల ఆందోళనకరమేనని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ రాకేష్‌ తార్వే అన్నారు. 20నెలల అత్యధిక పెరుగుదలను రూపాయి నమోదు చేసింది. ఇది ఎగుమతులపై ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చెప్పారు.

దేశీయంగా రూపాయి బలపడటం శుభపరిణామమే. దేశీయ బాండ్లు అత్యధిక ఫలాలను అందించేందుకు ఇది సాయం చేస్తుంది. దీంతోపాటు పెట్టుబడులు రావటంతో వృద్ధిరేటు పెరుగుతుంది. దేశంలోని బాండ్లు, స్టాక్‌ల్లో విదేశీపెట్టుబడి దారులు 15 బిలియన్‌ డాలర్లను షేర్లు, బాండ్లలోకి చొప్పించారు.

HACK: