తూర్పు చైనాలోని ఫూజియాన్ ప్రావిన్సులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దోమ ఓ గజదొంగను పట్టించింది. వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమేనండి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ దేశపు పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. అంత పెద్ద మనిషిని, అతి చిన్న దోమ ఎలా పట్టించింది? అసలు ఆ దొంగ ఏం చేశాడు? అనే విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు.
ఫూజియాన్ ప్రావిన్సులోని ఫుజోలో ఓ దొంగ ఇటీవల ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఖాళీగా ఉన్న ఇంటిని ఎంచుకొని బాల్కనీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే బాగా ఆకలితో ఉన్న అతడు.. ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, న్యూడుల్స్ కనబడటంతో ఎగ్ న్యూడుల్స్ చేసుకొని ఆకలిని తీర్చుకున్నాడు. ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు.
కానీ, ఆ ఇల్లంతా దోమలతో నిండిపోయింది. అతడిని నిద్రపోనివ్వకుండా పదే పదే కుట్టాయి, దాంతో అతడు అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకొని, ఓ మస్కిటో కాయిల్ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుట్టడం మాత్రం తప్పలేదు. తెల్లవారుజామునే లేచి ఇంట్లో ఉన్న సామాన్లను అందినకాడిడి దోచుకెళ్లాడు.
అనంతరం తమ ఇంట్లో దొంగతనం జరిగిందని యాజమాని ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పరిశీనలో.. ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉంది. గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డీఎన్ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం చాయ్ అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది.