mictv telugu

విజయ్ దేవరకొండ ఆవిష్కరించిన రెయిన్ బో మ్యూజిక్ ఆల్బం…

January 13, 2019

ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లా ఏడు భాషల్లో రెయిన్ బో(Spread the love.. Spread the peace) మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు దర్శకుడు డాక్టర్ ఆనంద్ కుమార్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో రూపొందించారు. యాంటీ రేసిజం(జాత్యంహకార వ్యతిరేకత) అనే నినాదంతో ప్రేమను పంచుదాం అంటూ సాగే వినసొంపైన సాహిత్యంతో పాట ఆసాంతం అలరిస్తుంది. ప్రపంచ శాంతిని కాపాడాలని, విద్వేషాలకు దూరంగా వుండాలని చెబుతుంది ఈ మ్యూజిక్ ఆల్బం. ఉస్మానియా యూనివర్సిటీ, నాగర్జున సాగర్, వరంగల్, లక్కవరం, గోవా తదితర ప్రదేశాలలో అత్యంత భారీగా ఈ పాట రూపొందడం విశేషం.  

నల్లగొండ జిల్లాకు చెందిన దర్శకులు డాక్టర్ ఆనంద్ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించారు. ఇటీవల అమెరికాలో జాత్యహంకార దాడిలో దుర్మరణం చెందిన తెలుగు విద్యార్థి  శరత్ కొప్పుకి నివాళి అర్పిస్తూ, అనన్య పెనుగొండ అనే తెలుగు యన్‌ఆర్‌ఐ అమ్మాయిని గాయనిగా పరిచయం చేస్తూ శ్రీమతి స్వాతి పెనుగొండ నిర్మించారు. కొప్పు రామ్మోహన్ , యన్‌యస్ నాయక్ సమర్పించిన  ఈ మ్యూజికల్ వీడియోని కేటీఆర్ గారి ఆశీస్సులతో, ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. లహరి మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో విడుదల అయింది.

ప్రముఖ హీరో సుధీర్ బాబు, ప్రముఖ గాయకులు యస్‌పి బాలసుబ్రమణ్యం, నిర్మాత రాజ్ కందుకూరి, తమ్మారెడ్డి భరద్వాజ, నీలకంఠ, శివలెంక కృష్ణ ప్రసాద్, సంగీత దర్శకులు ఆర్‌పి. పట్నాయక్, రఘు కుంచె,  దర్శకులు సంపత్ నంది, సాగర్ చంద్ర, శేఖర్ మాస్టర్ ఇలా ఎందరో సినీ ప్రముఖుల మన్ననలు పొందిన ఈ మ్యూజికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. పెద్దపల్లి రోహిత్ రచన, సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సిద్దం మనోహర్ కెమెరా, సుమన్ రుద్రు ప్రధాన పాత్రలో నటించారు.

తాజాగా అమెరికాలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణ త్వరగా కోలుకోవాలని దర్శకులు ఆనంద్ ఆకాంక్షించారు.   ప్రతి ఒక్కరూ రెయిన్ బో మ్యూజికల్ వీడియోని చూసి, జ్యాత్యహంకార దాడులలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ఇస్తున్న తమ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలన్నారు.

తమ కొడుకు అకాల మరణం తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చినా, దర్శకులు ఈ పాటను శరత్ కొప్పుకి అంకితం ఇవ్వడం వల్ల, తమ కొడుకు ఇంకా తమ మధ్యనే వున్నట్లుగా అనిపిస్తోందని శరత్ తండ్రి కొప్పు రామ్మోహన్ అన్నారు. క్రింది లింకులో పాటను పూర్తిగా వీక్షించవచ్చు. Telugu news Vijay Devarakonda’s new rainbow music album …