Home > Featured > వీడియో: మెక్సికోలో వింత పెళ్లి..ఏకంగా మొసలినే..

వీడియో: మెక్సికోలో వింత పెళ్లి..ఏకంగా మొసలినే..

మెక్సికో దేశంలో ఓ విచిత్ర పెళ్లి జరిగింది. పెళ్లి అంటే యువకుడు, యువతి కాదండోయ్, ఓ మేయర్ ఓ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. అదేంటీ మొసలిని చూసి అందరు భయపడుతారు కదా.. మరి మేయర్ ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనే అనుమానం మీకూ కలుగవచ్చు. కానీ, ఇదే నిజమట. మొసలిని పెళ్లి చేసుకోవటం అక్కడి తరతరాల ఆచారమట. అలా పెళ్లి చేసుకోకపోతే ఆ గ్రామ ప్రజలు జీవనం ముందుకు సాగాదట. మరి ఈ ఆచారం ఏంటీ? ఆ గ్రామ ప్రజలు జీవనం ఏంటీ? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మెక్సికోలో ఒక్సాకా అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజల వృత్తి చేపల వృత్తి. చేపలు బాగా దొరకాలంటే జలాశయాల్లో నీళ్లు బాగా ఉండాలి. నీళ్లు బాగా ఉండాలంటే వర్షాలు పడాలి. అలా వర్షాలు పడేందుకు చేసే ఒక సంప్రదాయంలో భాగమే 'మొసలిని పెళ్లి' చేసుకునే ఆచారమట. ఒక్సాకా గ్రామ మేయర్ విక్టర్ హ్యూగో సోసా గత గురువారం ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఆ గ్రామ ప్రజలు డబ్బులు, వాయిద్యాలతో ఊరేగింపు చేశారు. ఆ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఆచారంపై అక్కడి గ్రామస్థులు మాట్లాడుతూ.. "మొసలిని ప్రకృతికి, భూమికి, దైవత్వానికి ప్రతీకగా భావిస్తాం. మొసలిని పెళ్లి చేసుకోవడం అంటే ప్రకృతికి మనిషి దగ్గర కావడమే. అందుకోసమే ఈ పెళ్లి తంతు జరిగింది. ఈ పెళ్లి చాలా వైభవంగా, సంప్రదాయబద్దంగా నిర్వహిస్తాం. ముందుగా మొసలిని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తాం. ఆ తర్వాత వరుడిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి పెళ్లి చేసి ఆ తర్వాత మొసలితో కలిసి ఊరేగిస్తాం. ఇలా పెళ్లి చేస్తే వర్షాలు బాగా పడతాయని మా నమ్మకం" అని వారు అన్నారు.

మరోపక్క భారతదేశంలో కూడా వర్షం పడడానికి ఓ ఆచారం ఉంది. పలు గ్రామాల్లో మహిళలంతా కలిసి కప్పలకు పెళ్లిల్లు చేసి, వాటిని ఓ పసుపు బట్టలో కట్టి రోకలికి వాటిని కట్టి ఊరేగిస్తారు. అంతేకాదు ఇంటింటికి తిరుగుతూ, వర్షం పడాలని వాటిపై బిందెడు నీళ్లు పోస్తారు. చివరికి ఊరి బయటి ఓ బండమీద పకృతి నైవేద్యం తయారు చేసి అందరికి పోస్తారు. అదేవిధంగా మెక్సికోలో కూడా వర్షం పడాలంటే మొసలిని పెళ్లి చేసుకోవటం ఓ ఆచారమట.

Updated : 3 July 2022 1:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top