‘నో హెల్మెట్, నో ఫ్యూయల్’ఇదేదో పోలీసుల ఆర్డరో..పెట్రోల్ బంకుల ప్రచారమో కాదు. ఇది సర్కార్ పెట్టిన రూల్. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..లేదంటే బండిని తోసుకునిపోవాల్సిందే…
హెల్మెట్ పెట్టుకోండి రా బాబు.. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు… క్రాఫ్ చెదిరిపోతుందని ఒకరు… ఇంట్లో మరిచిపోయానని మరొకరు పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నారు. అమ్మాయిలైతే జుట్టు రాలిపోతుందని పోలీసులకు కహానీలు చెప్పేస్తుంటారు. ఇక నుంచి వేషాలు చెల్లవ్.. హెల్మెట్ మస్ట్ గా ఉండితీరాల్సిందే.
డైనమిక్ యూపీ సీఎం యోగి మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హెల్మెట్ లేకుండా బంక్‌లకు వచ్చే వారికి పెట్రోల్ విక్రయించొద్దని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఈ విధానాన్ని లఖ్‌నవూలో అమల్లోకి తీసుకొచ్చింది యూపీ సర్కార్.
హెల్మెట్ లేకుండా ఎవరైనా బైక్ నడుపుతూ పెట్రోల్ కోసం వస్తే.. వారికి ఇంధనం విక్రయించకూడదని లఖ్‌నవూలోని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించింది. అంతేగాక, ఆ బైక్ నంబర్లను నోట్ చేసి.. పోలీసులకు ఇవ్వాలని పేర్కొంది. ఈ విధానంపై పెట్రోల్‌బంక్ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ పోలీసు శాఖ ఈనెల 18నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రయల్‌రన్ నిర్వహించింది. సోమవారం నుంచి వారంపాటు ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ నిబంధన కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రతి బంకు దగ్గర ఎస్సై ర్యాంకు పోలీసు అధికారిని నియమిస్తారు. హెల్మెట్ లేకుండా కన్పిస్తే.. చలానాలు జారీ చేస్తారు.
ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చేందుకు యూపీ ప్రభుత్వం యోచిస్తోంది.