హైదరాబాద్ గల్లీల్లో గరీబోడి దవాఖానాలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ గల్లీల్లో గరీబోడి దవాఖానాలు

December 16, 2017

గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది. ఆ పెద్ద కథలో ఎన్నో సమస్యలు. వాటిలో  ముఖ్యమైనవి ఆరోగ్య సమస్యలే. సర్కార్ దవాఖానలు సక్కగ లేక, కార్పోరేట్ ఆసుపత్రులకు పోయే తాహతు లేక బీదోడు బీమార్ తోనే బతికేస్తున్నాడు. మరణిస్తున్నాడు. ఆర్థిక వృద్ధిని మాత్రమే కోరుకునే ప్రభుత్వాలు ఆరోగ్య వృద్ధిని పట్టించుకోవు. అందుకే సర్కార్ దవాఖానాలంటేనే సావులకు షార్ట్ కట్ అని జనం భయపడతరు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని మార్చడంలో కొంతవరకు విజయవంతం అయింది. వందశాతం మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆరోగ్యకర సమాజంతోనే హైదరాబాద్ ను విశ్వనగరం అవుతుందని భావిస్తున్న ప్రభుత్వం, నగర ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తెస్తోంది.

బస్తీ దవాఖానా

నగరంలోని 1400 మురికివాడల్లోని ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 5 కిమీ లోపు ఒక్క ఆసుపత్రి కూడా లేని 50 బస్తీల్లో దవాఖానాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్, స్టాఫ్ నర్స్, నర్స్ లు ఈ ఆసుపత్రిలో ఉంటారు. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారు. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. రానున్న రెండు మూడు నెలల్లో వీటిని ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత వెయ్యి బస్తీల్లో ఈ దవాఖానాలను ప్రారంభిస్తారు.

వైద్య సేవల విస్తరణ

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 145 సిహెచ్ సిలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రుల్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ పై గురి కుదిరింది. ఓపి పెరిగింది. దీంతో వీటిపై రద్దీ తగ్గించే ఉద్దేశ్యంతో 30 సర్కిళ్లలో అదనంగా ఒక్కో సిహెచ్ సిను ప్రభుత్వం ఏర్పాటుచేయబోతుంది. అలాగే ఐదు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున 100 పడకల ఆసుపత్రులు ఐదింటిని  నెలకొల్పబోతుంది.

సిటీ హెల్త్ సొసైటీ

నగర ప్రజల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని త్వరలో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతుంది. ఇందుకోసం సిటీ హెల్త్ సొసైటీని స్టార్ట్ చేయబోతుంది.

ఢిల్లీ మొహల్లా క్లీనిక్ ల మాదిరిగనే గల్లి గల్లి కి దవాఖాన ఆలోచన మంచిదే –అయితే ఆచరణ లో అది విజయవంతం అయినప్పుడే దాని ప్రతిఫలాలు అందరికి అందుతాయి.