యాదృచ్చికం అంటే ఇదేనేమో. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి ఓటు వేశారు ప్రజా యుద్ధనౌక గద్దర్. తన జీవితంలో కూడా ఇది తొలి ఓటు అవడం మరొక విశేషం. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. తన సతీమణితో కలిసి సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వెంకటాపురం పోలింగ్ కేంద్రంలో గద్దర్ ఓటు వేసి రికార్డ్ బ్రేక్ చేశారు. చేతిలో అంబేద్కర్ ఫొటోతో పోలింగ్ కేంద్రానికి వచ్చారాయన. గతంలో ఎన్నోసార్లు ఎన్నికలను బహిష్కరించాలని అన్న ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని అన్నారు. అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రజా కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్ట్ పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏడాది కిందట తొలిసారిగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. మావోయిస్టు పార్టీ రాజాకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన అప్పట్లోనే ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించి వెనకకు తగ్గారు.
Telugu news Septuagenanrian to vote for first time in Telangana assembly ..