"10 Lakh Jobs, 20 Lakh Employment": Nitish Kumar's Big Bihar Announcement
mictv telugu

బిహార్ యువతకు వజ్రోత్సవ కానుక.. 10లక్షలు ఉద్యోగాలిస్తామని సీఎం హామీ

August 15, 2022

బిహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ ప్రతిష్టాత్మక వాగ్దానానికి మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మొత్తం ఉద్యోగావకాశాలు చివరికి రెట్టింపు అవుతాయని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడారు. తమ సంకీర్ణ ప్రభుత్వ (జేడీయూ- ఆర్జేడీ కూటమి) ఆకాంక్ష మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు… మరో 10 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.

ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని తెలిపారు. సీఎం ప్రకటనపై తేజస్వి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతి పెద్ద ప్రకటన చేశారన్నారు. సీఎం హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. మొన్నటి వ‌ర‌కు బీహార్ లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ లు ఇప్పుడు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టారు.