తప్పక చూడండి.. 10టీవీలో ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ.. ఈ శనివారం రాత్రి 8:10 గం,కు - MicTv.in - Telugu News
mictv telugu

తప్పక చూడండి.. 10టీవీలో ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ.. ఈ శనివారం రాత్రి 8:10 గం,కు

November 29, 2019

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సరికొత్త జానపదాల పాటలపోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’. పాటల పోటీ పెడుతున్నాం అని మేము ఇలా పిలుపు ఇవ్వగానే చాలామంది స్పందించారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల నుంచి మూడు వేల ఎంట్రీలు వచ్చాయి. పడుచు పిల్లాడే కాదు 60 ఏళ్ల అవ్వ కూడా నేను పాటలు పాడతానని వచ్చారు. వారందరి నుంచి జల్లెడపట్టి 48 మందిని ఎంపిక చేశాం. వారితో ఫోక్ స్టూడియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనకు పరిచయం లేని ఎన్నో మట్టివాసన, ఊరి పరిమళం అద్దుకున్న పాటలు పాడారు. ఈ శనివారం నుంచి రాత్రి 8:10 గంటలకు 10 టీవీలో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆదివారం కూడా ప్రసారం అవుతుంది. వారం వారం మీకు సరికొత్త అనుభూతిని పంచడానికి ఫోక్ స్టూడియో పాటల కార్యక్రమం వస్తోంది. తప్పక చూడండి.

 

ఊరూవాడా జల్లెడ పట్టి మట్టిలోని మాణిక్యాలను పట్టుకొచ్చాం. వాళ్లు గొంతెత్తి అలవోకగా అలా జానపదాలు ఆలపిస్తుంటే ప్రకృతే పరవశిస్తుంది. వాళ్లంతా గ్రామాల్లోని కొండా కోనల్లో పశువులు కాస్తూ పాడుకుంటారు.  పచ్చటి పొలాల్లో నాట్లేస్తూ, కలుపులు తీస్తూ రాగం తీస్తారు. పొయ్యిలోకి కర్రలు కొడుతూ కూనిరాగాన్ని లాగుతారు. బర్రెలకు పాలు పితుకుతూ, మసకపొద్దున పడుగులు వేసి గడ్డి తొక్కిస్తూ శ్రుతిలయలను కదం తొక్కిస్తారు. పనిలో పాటను మిళితం చేసి జీవితంలో పాటనూ కలుపుకుని మట్టివాసనను తనువంతా పులుముకున్న ధన్యజీవులు వాళ్లు. వారికి ప్రకృతే గురువు. పనే చదువు. మామూలు మాటలనే పాటలుగా గైకట్టి మధురమైన జానపదాలు ఆలపిస్తున్న అలాంటి అద్భుత గాయకులు ఇప్పటికీ మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.  

మరి వారు పాడటానికి ఓ వేదిక కావాలి కదా. ఏ టీవీ ఛానల్లో చూసినా సినిమా పాటలు తప్పితే జానపదాలను ఆదరించేవారు ఎవరు? ఈ లోటును తీరుస్తూ  మైక్ టీవీ, 10 టీవీలు కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. మట్టిలోని జనపదాల మాణిక్యాలను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించాయి. కృత్రిమత్వం ఏ మాత్రం లేని  ఆ బతుకు రాగాల మట్టిమనిషిని ఓ వేదికపైకి తీసుకురావాలని ఓ ప్రయత్నం చేశాయి. అదే ‘ఫోక్ స్టూడియో’ పాటల పోటీ. వినూత్న పంథాలో సాగే ఈ పోటీ కోసం మేం పిలుపు ఇవ్వగానే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ‘మేమూ పాడతాం.. మాకూ ఒక అవకాశం ఇవ్వండి’ అని వేల మంది అడిగారు. మేం కాదంటామా చెప్పండి. మీకిదే మా ఘనస్వాగతం అని  చేతులు చాచాం. 

ఈ గాయకుల్లో కొందరు శ్రమైక జీవులు. అవ్వల నుంచి, అత్తల నుంచి పాటలు నేర్చుకున్నారు. కొందరు ఉన్నత చదువుతూ కూడా జానపదాలను గౌరవిస్తున్నారు. చిన్నవాళ్లే కాదు 60 ఏళ్ల పెద్దమ్మ కూడా నేనూ పాట పాడతనని ఉత్సాహంతో వచ్చారు. ఆమెకు ఫోన్లు, వాట్సాప్‌లు తెలియవు. మా ప్రోమోను చూసిన కొందరు ఆమె పాడుతుంటే వీడియో రికార్డు చేసి పంపారు. 

 ఒక టైలర్.. ఒక మేస్త్రీ.   టీచర్, కూలీ.. అందరూ ముందుకొచ్చారు.  మూడు వేల మంది లోంచి 48 మందిని పోటీకి ఎంపిక చేశాం. వారి కమ్మని పాటల పోటీ కార్యక్రమం ఈ శనివారం నుంచి మీ అభిమాన 10 టీవీ చానల్లో ప్రసారం అవుతుంది. శని, ఆదివారాలు రాత్రి 8:10 గంటలకు ప్రసారం అవుతుంది. 

మీరంతా తప్పకుండా ఈ పాటల పోటీని చూడాలి. ఫోక్ స్టూడియోలో ఎగసిపడిన స్వచ్ఛమైన ఆ జనపదాల్లో మీరూ ఉప్పొంగాలి. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని మంగ్లీ, ‘పటాస్’ నటుడు బల్వీర్ సింగ్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. జానపద పండితులు సీనియర్ పాటగాళ్లు, రాతగాళ్లు మురళి మధు, వరంగల్ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రతివారం ఓ ముఖ్య అతిథి ఆత్మీయంగా పలకరిస్తారు. కార్యక్రమం మధ్యమధ్యలో అక్కాతమ్ముళ్ల (మంగ్లీ, బాలీ) హాస్యం కూడా మిమ్మల్ని అలరిస్తుంది. రండి.. మా ఫోక్ స్టూడియో పాటల సందడిని వారం వారం తప్పకుండా చూడండి. మీకు సరికొత్త అనుభూతిని కలిగించే పాటలు వింటూ, చూస్తూ మీ ఊరిని, తాతను, నానమ్మను, అవ్వలక్కలను ఆత్మీయంగా పలకరించి వచ్చే కమ్మని అనుభూతికై గెట్ రెడీ టు శని, ఆదివారాలు రాత్రి 8:10 గంటలు.