చిట్టి వంటలక్క .. వయసు పదేళ్లు, గంటకు 30 వంటలు..  - MicTv.in - Telugu News
mictv telugu

చిట్టి వంటలక్క .. వయసు పదేళ్లు, గంటకు 30 వంటలు.. 

October 12, 2020

పదేళ్ల వయసున్న పిల్లలు ఏం చేస్తారు అంటే.. అమ్మ వండిపెట్టింది తిని చక్కగా చదువుకుంటారు, ఆడుకుంటారు. అప్పుడప్పుడు నాకు అది కావాలి.. ఇది కావాలని మారాం చేసి అమ్మతో తమకు ఇష్టమైన వంటకాలు చేయించుకుని లాగిస్తుంటారు. అయితే, కేరళకు చెందిన ఓ చిన్నారి మాత్రం అమ్మలా వండి పెడుతోంది. గంటకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రకాల వంటలు వండుతోంది. ఇడ్లీ, దోశ, ఊతప్ప, ఫ్రైడ్ రైస్, అప్పం, చికెన్ రోస్ట్, ఆమ్లెట్,  పన్నీర్ టిక్కా, వాఫెల్, కార్న్ ఫ్రిట్టర్స్, పుట్టగొడుగుల టిక్కా, ఊతప్పం, ఎగ్ బుల్స్ ఐ, శాండ్‌విచ్, పాప్డీ ఛాట్, పాన్ కేక్.., ఇలా ఏది చెప్పినా చిటికెలో రెడీ చేసి మనముందు పెట్టేస్తుంది. అలాగే ఆ చిట్టితల్లి చేసే వంటల్లో రుచి అమోఘంగా ఉంటుందని ఆమె చేతివంట రుచిచూసినవారు చెబుతుంటారు. 

ఆ బుల్లి వంటలక్క పేరు శాన్వి (10సంవత్సరాల 6నెలల 12రోజుల వయస్సు). ఎర్నాకులానికి చెందిన వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కుమార్తె. తన వంటలతో ఈ చిన్నారి వంటలక్క ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం దక్కించుకుంది. లోకం తెలియని ఓ చిన్నారి చాలా వంటలు చేయగలుగుతుందనే పేరుతో రికార్డు నమోదైంది. ఈ రికార్డును ఆగష్టు 29న బాలిక నమోదు చేసింది. విశాఖపట్నంలోని బాలిక ఇంట్లో చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించింది. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు 33 ఐటెంలు రెడీ చేస్తుండగా తల్లి మాంజిమాతో పాటు అక్కడే ఉన్నారు. తాను ఇన్నిరకాల వంటలు చేయడానికి కుటుంబం, స్నేహితుల అండ ఎంతో ఉందని శాన్వి తెలిపింది. తన తల్లి స్టార్ చెఫ్ అని.. రియాలిటీ కుకరీ ఫైనలిస్ట్ అని పేర్కొంది. అమ్మను ఆదర్శంగా తీసుకునే ఇది సాధించానని చెప్పింది. ఇంకా చిన్న వయస్సులోనే తల్లితో పాటు వంటగదిలో అద్భుతంగా వంటలు చేసేదని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా, శాన్వి చిల్డ్రన్ కుకరీ షోలలో కూడా పాల్గొంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ తర వంటలతో నెటిజన్ల మెప్పు పొందుతోంది.