చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు. ఓ వ్యక్తిని భవనం మీద నుంచి తోసి చంపేద్దాం అనుకున్నారు. అయితే అతను భవనం మీద నుంచి పడి ఏడాది పాటు కోమాలోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు కోమా నుంచి బయటపడ్డ అతను తనమీద జరిగిన దారుణం గురించి పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో సుదీర్ఘంగా విచారించిన కోర్టు ఇద్దరు నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోల్‌కతాకు చెందిన శౌవిక్ ఛటర్జీ, అతని స్నేహితులు అసోంకు చెందిన శశాంక్ దాస్, ఒడిశాకు చెందిన జితేంద్ర కుమార్ బెంగళూరులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ సమయంలో ఛటర్జీ ఓ యువతితో చనువుగా ఉన్నాడు. అయితే ఆ యువతిని దాస్ కూడా ఇష్టపడ్డాడు. తాను ఇష్టపడ్డ యువతిని చటర్జీ కూడా ఇష్టపడటాన్ని దాస్ సహించలేకపోయాడు. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
జితేంద్రతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. ఓరోజు ఛటర్జీని తమ ఇంటికి రప్పించారు. టెర్రస్ పైకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పారు. వారి మాటలు నమ్మిన అతను అక్కడికి వెళ్లగానే ఛటర్జీని కొట్టి కిందకు తోసేశారు. ఈ ఘటన 2010 డిసెంబర్లో చోటు చేసుకుంది. అయితే తీవ్రంగా గాయపడిన ఛటర్జీ కోమాలోకి వెళ్లిపోయాడు. ఛటర్జీ చచ్చిపోతే తమను ఎవరూ పట్టుకోలేరని భావించారు నిందితులు. దాదాపు ఏడాది గడిచాక 2011 ఆగస్ట్‌లో ఛటర్జీ కోమా నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు తనమీద జరిగిన దారుణం గురించి చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 2012లో ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత కేసు విచారణ పూర్తి అయింది. ఎట్టకేలకు ఈ కేసులో దాస్, జితేంద్రలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారిద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, ప్రస్తుతం దోషుల్లో ఒకడైన శశాంక్ దాస్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. జితేందర్ కుమార్ బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు.