యాదాద్రికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ” యాదాద్రికి 100 మినీ బస్సులను అందుబాటులో ఉంచాం. స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు యాదాద్రికి భారీగా తరలివెళ్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వద్దకు బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి మినీ బస్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చు” అని అన్నారు. అంతేకాకుండా జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఛార్జ్ ఉంటుందని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌకర్యవంతంగా యాదాద్రి చేరుకోవచ్చని సజ్జనార్ తెలిపారు.
మరోపక్క.. స్వామివారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనం మంగళవారం ప్రారంభమైంది. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.8,17,580 ఆదాయం వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం కేసీఆర్ యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతోపాటు, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మహా కుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు.