పాక్ నుంచి పారిపోయివచ్చిన 200 మంది హిందువులు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ నుంచి పారిపోయివచ్చిన 200 మంది హిందువులు

February 4, 2020

Pakistan.

పాకిస్తాన్‌లో తాము తీవ్ర అభద్రతాభావంతో బతుకుతున్నామని, తిరిగి ఆ దేశానికి వెళ్లాలంటే భయంగా ఉందని పాక్ నుంచి భారత్ వచ్చిన దాదాపు 200 మంది హిందువులు అంటున్నారు. సోమవారం వారంతా అత్తారి-వాఘా సరిహద్దు గుండా భారత్‌కు వచ్చారు. భారత పౌరసత్వం లభిస్తే సంతోషంగా స్వీకరించి, ఇక్కడే సుఖంగా బతుకుతామని వేడుకుంటున్నారు. ప్రస్తుతం విజిటింగ్ వీసాలు ఉన్నాయి. తమకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

పాక్‌లో తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ముఖ్యంగా హిందూ బాలికలు కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసేస్తున్నారని కొందరు మహిళలు వాపోయారు. ఈ ఘటనలపై  పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ) అమల్లోకి వచ్చాక పొరుగు దేశాల్లోని చాలామంది హిందువులు భారత్ బాట పట్టినట్లు సమాచారం.

మరోవైపు పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన నాలుగు సిక్కు కుటుంబాలను అక్కున చేర్చుకోవడానికి శిరోమణి అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిక్రా అత్తారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం కలిసి, వారికి సాధ్యమైనంత త్వరగా భారత పౌరసత్వం ఇప్పించేలా చూస్తానని మంజిందర్ సింగ్ వెల్లడించారు.