పంచమ్ సింగ్ చౌహాన్… ఈ పేరు వింటే చంబల్ లోయ గజగజ వణికిపోయేది. అర్ధ శతాబ్దం కిందట బందిపోట్ల రాజ్యంగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆ ప్రాతంలో పంచమ్ నేరాలను కథలు కథలుగా చెప్పుకునేవారు. 1960 దశకంతో పంచమ్ నేరాల కేరాఫ్ అడ్రస్. తను 125 మందిని చంపానని అతడు చెప్పేవాడు. అతన్ని పట్టుకోవడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం నానా అగచాట్లు పడింది. ఆ రోజుల్లోనే అతని తలపై ఏకంగా రూ. 2 కోట్లు రివార్డు ప్రకటించింది. ఎంత నేరగాడికైనా బతుకుపై తీపి ఉంటుంది కనుక పంచమ్ లొంగిపోయాడు. ఒక కీలక షరతు పైనే అది జరిగింది. తనకు మరణశిక్ష విధించకూడదని కోరాడు. 1972లో లొంగిపోయిన అతణ్ని ప్రభుత్వం జైలుకు పంపి, జీవిత ఖైదు తర్వాత విడుదల చేసింది. ఇంటికి వెళ్లాక పంచమ్ పూర్తిగా మారిపోయాడు. అపర భక్తులై ప్రవచనకారుడి అవతారం ఎత్తాడు. వైరాగ్యంతో ఆస్తులను కూడా దానం చేశాడు. ఇప్పుడతని వయసు వందేళ్లు. ఇంతవరకూ తన మానాన తను బతుకుతున్న పంచమ్ ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. తను దానం చేసిన ఆస్తిని నేలకూల్చొద్దంటూ నిరాహార దీక్షకు దిగాడు.
మధ్యప్రదేశ్‌లోని లహర్ మునిసిపాలిటీలో పంచమ్‌కు ఓ ఇల్లు ఉండేది. దీన్ని 35 ఏళ్ల కిందట ఓ ఆధ్యాత్మిక సంస్థకు దానం చేశాడు. ఇప్పుడు దాని ఖరీదు 50 లక్షలకు పైనే. ఆ ఇంటి వెనక మునిసిపల్ అధికారులు ఓ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. పంచమ్ దానం చేసిన ఇల్లు ఆ కాంప్లెక్సుకు అడ్డంగా ఉందని కూల్చివేస్తామంటూ నోటీసు ఇచ్చారు. అయితే నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చడం సరికాదని పంచమ్ కుటుంబం అంటోంది. ఆ ఇంటికి కరెంటు బిల్లు చెల్లించడం లేదని పంచమ్‌కు గతంలో అరెస్ట్ వారంట్లు జారీ అయ్యాయి. ఇంటిని వాడుకున్న ఆధ్యాత్మిక సంస్థ వల్లే ఈ సమస్య వచ్చిందటున్నారు పంచమ్ కుటుంబ సభ్యులు. ఏదేమైనా తను దానం చేసిన ఇంటిని కూల్చేస్తే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదంటూ పంచమ్ నిరాహార దీక్షకు దిగాడు.