చిక్కుల్లో గడ్కరీ.. 15 కేజీలు తగ్గి 15 వేల కోట్లు ఇవ్వాలంటున్న అనిల్ - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కుల్లో గడ్కరీ.. 15 కేజీలు తగ్గి 15 వేల కోట్లు ఇవ్వాలంటున్న అనిల్

June 11, 2022

ఆడిన మాట తప్పరాదు అంటారు పెద్దలు= కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఏదో తమాషాగా అన్న మాట ఆయన విశ్వసనీయతను ఇప్పుడు గట్టిగా నిలదీస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, తూచ్ అంటారా అని ఆసక్తి మొదలైంది. ఒక కేజీ బరువు తగ్గితే వెయ్యి కోట్ల నిధులు ఇస్తానంటూ గడ్కారీ ఓ ఎంపీకి ఇచ్చిన ఆఫర్ కథ ఇది. సదరు ఎంపీ ఒక కేజీ కాదు, భయంకరంగా వర్కౌట్లు చేసి 15 కేజీల బరువు తగ్గి, ‘మాట ప్రకారం 15 వేల కోట్లు ఇవ్వండి’ అని గడ్కరీ వెంట పడుతున్నాడు. మూడు నెలల కిందట గడ్కరీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఉజ్జయని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని ఆయనను అడిగారు. తనలాగే అనిల్ కూడా లావుగా ఉండడంతో గడ్కరీ ఆట పట్టిపట్టించారు. ‘నేను 135 కేజీల బరువు ఉండేవాడిని. కష్టపడి ఇప్పుడు 93 కేజీలకు చేరుకున్నాను. నువ్వు కూడా తగ్గు. ఒక కేజీ తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున ఇస్తా’ అని అన్నారు. అనిల్ దీన్ని సీరియస్‌గా తీసుకుని మూడు నెలలుగా భారీ కసరత్తులు చేశారు. 125 కేజీల బరువు ఇపుడు 110 కేజీలు తూగుతున్నాడు. 15 కేజీలు తగ్గాను కాబట్టి గడ్కరీ మాట ప్రకారం 15వలే కోట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నాడు!