కుక్కలు మనిషికి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అయితే ఊర మాస్ కుక్కల విషయంలో ఈ మాట చెల్లదు. జీవకారుణ్యం ఒలకబోసేవాళ్లు వాటికి పిడికెడు కూడా తిట్టపెట్టరు. హైదరాబాద్ అంబర్‌పేటలో ఓ చిన్నారిని కుక్కలు ఎంత దారుణంగా చంపాయో చూశాం. వీధికుక్కల సంగతి వదిలేస్తే కొన్ని పెంపుడు కుక్కల పరిస్థితి కూడా పైకి కనిపించేంత స్టయిలిష్‌గా ఏమీ ఉండదు. ముఖ్యంగా జబ్బుపడిన కుక్కలు, ముసలి కుక్కల పరిస్థితి ఘోరం. వాటిని యజమానులు ఏం చెయ్యాలో దిక్కుతోచక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. డబ్బులు ఖర్చు చెయ్యడం ఇష్టం లేని వాళ్లు వీధుల్లో, ఊరిబయట వదిలేస్తారు. కొందరు పాపమని, వాటిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకుంటారు. కారణం ఏదేతేనేం అలా తన దగ్గరికి చేరిన వెయ్యి కుక్కలు ఓ మనిషి ఆకలితో మాడగొట్టి చంపేశారు. దక్షిణ కొరియాలో ఈ ఘోరం జరిగింది .
గాంగి రాష్ట్రంలోని యంగ్‌పోంగ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి యజమానులకు బరువైన కుక్కలు తీసుకుంటున్నాడు. వాటికి తిండిపెట్టకుండా చంపడమే అతని పని. ఇంతవరకు వెయ్యికిపైగా కుక్కల్ని అలా చంపాడు. చంపినందుకు ఒక్కో కుక్కకు రూ. 623 రూపాయలు వసూలు చేశాడు. చచ్చిపోయిన కుక్కలను పూడ్చిపెట్టి, బతికిన వాటిని బోనుల్లో, సంచుల్లో బంధించడం, అవి చనిపోయాక, గతంలో చనిపోయినవాటిపైన పడేసి పూడ్చడం ఇతి స్టైల్. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అమానుషం తాజాగా బయటపడింది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కనిపించలేదని తిరుగుతూ, వృద్ధుడి దగ్గర కుక్కలున్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్లడంతో విషయం బహిర్గతమైంది. జంతు హక్కులను ఉల్లంఘించాడంటూ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. అతనికి రూ. 2 లక్షల జరిమానా, లేకపోతే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.