కేరళలోని ఓ పోలీస్ స్టేషన్‌లో మందుబాబులకు వింత శిక్ష విధించారు పోలీసులు. విధించారు. మందు కొట్టి డ్రైవింగ్ చేస్తున్న వారితో.. స్కూల్‌లో స్టూడెంట్లకు టీచర్లు పనిష్మెంట్ ఇచ్చినట్లుగా.. ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు కొచ్చి నగరంలో పోలీసులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వారికి ఈ శిక్ష విధించారు. మందుబాబులంతా చేసేది లేక పోలీస్ స్టేషన్లో నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాశారు. పెన్ను, పేపరు పట్టుకుని.. పోలీసులు చెప్పినట్టే “ఇకపై తాగి డ్రైవింగ్ చేయను” అని వెయ్యి సార్లు రాశారు.
అయితే.. మద్యం మత్తులో వాహనాలు నడిపినవారు ఇలా వెయ్యి సార్లు రాసినా.. వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు అంటున్నారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు. పోలీసులకు చిక్కినవారి జాబితాలో 12 మంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, ఇద్దరు కేఎస్ఆర్టీసీ డ్రైవర్లు, ఇద్దరు స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఉన్నారు. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు.