ఆస్ట్రేలియాలో మరో దారుణం.. 5 వేల ఒంటెలు కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాలో మరో దారుణం.. 5 వేల ఒంటెలు కాల్చివేత

January 14, 2020

Australia.

ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. ఓవైపు ఆస్ట్రేలియా అడవులను కార్చిచ్చు దాహించి కోట్ల మూగ జీవాలను బలి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అది చాలదన్నట్టు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల పైనే అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఆదివాసీ జనావాసాలకు అవి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, జనావాసాల పరిరక్షణ కోసం ఇంతకన్నా వేరే మార్గం లేదని ఈ పశుమేథానికి పాల్పడ్డామని ప్రభుత్వం చెబుతోంది. హెలికాప్టర్లలో గన్‌మెన్‌లు కూర్చొని ఆస్ట్రేలియాలోని అనంగు ఆదివాసీ ప్రాంతంలో ఒంటెల తలలపై తుపాకులు గురిపెట్టి అడవిలో వాటి రక్తం చిందించారు. బయటి నుంచి దిగుమతైన ఒంటెలు స్థానికుల పాలిట శాపంలా తయారయ్యాయని.. రోడ్లమీద కార్లలో ప్రయాణించేవారిని అవి ఇబ్బందులకు గురిచేస్తుండటంతో చంపామని చెబుతోంది. 

ఐదురోజుల పాటు సాగిన వేట మంగళవారంతో ముగిసింది. ‘ఈ ఒంటెలు ఆస్ట్రేలియాకు చెందినవి కావు. 1840 ప్రాంతంలో వాటిని ఆస్ట్రేలియా అన్వేషణ కోసం తీసుకువచ్చి వదిలేశారు. బారత దేశం నుంచి కూడా 20 వేల ఒంటెలను దిగుమతి చేసుకున్నారు. వీటి అవసరం తీరిపోయిన తర్వాత ఇవి క్రమంగా అడవుల్లోకి వెళ్లి తమ సంతతిని విపరీతంగా పెంచుకున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోతుండగా నీటి కోసం ఇవి జనావాసాల పైకి వచ్చి దాడి చేస్తున్నాయి. పెరిగిపోయిన ఒంటెల మందలు చెట్టూ, చేమలను, నీటి వనరులను పాడు చేస్తూ ఆదివాసీలకు తెగ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పచ్చదనం కొంచెం అధికమొత్తంలో కనిపించే అనంగు ప్రాంతంలో 2300 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయంత తీసుకుంది’ అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 

కాగా, ప్రభుత్వ తీరుపై జంతు ప్రేమికుల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మారుమూల ప్రాంతంలోని ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వారికి ప్రభుత్వం చెప్పి వారి ఉద్యమాన్ని ఆపారు.