104 గంటల ఆపరేషన్..500 మంది సిబ్బంది..చివరికి బాలుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

104 గంటల ఆపరేషన్..500 మంది సిబ్బంది..చివరికి బాలుడు..

June 15, 2022

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజులక్రితం ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయిన సంఘటన కలకలం రేపింది. అక్కడున్న స్థానికులు బాలుడు బోరులోపడిపోవటాన్ని గుర్తించి, అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నాలుగు రోజులపాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. జంజ్‌గిర్ జిల్లా మల్‌ఖోర్దా బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహూ అనే దివ్యాంగ బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంటి వెనుక ఆటాడుకుంటూ, అక్కడే ఉన్న 80 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి, అధికారులకు సమాచారం అందించడంతో.. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఈ ఆఫరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, స్థానిక అధికారుల సహా 500 మందికిపైగా పాల్గొన్నారు. బాలుడు 60 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం సమాంతరంగా ఓ గుంతను తవ్వారు. సుదీర్ఘంగా 104 గంటలు పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి, చివరకు దేవుడి దయ, అందరి ప్రార్థనలు ఫలించడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

అనంతరం అ బాలుడికి మెరుగైన వైద్యం కోసం బిలాస్‌పూర్‌లో అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో బాలుడి కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసినట్టు బిలాస్‌పూర్ కలెక్టర్ జితేందర్ శుక్లా తెలిపారు. అత్యాధునిక పరికరాలు, వాహనాలతో సహాయక చర్యలు కొనసాగగా, సీఎం బాఘేల్ ఆదేశాలతో పది మందికిపైగా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఘటనాస్థలంలోనే మకాం వేసి పర్యవేక్షించారు.

మరోపక్క ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌ మాట్లాడుతూ.. ‘‘అందరి ప్రార్థనలు, రెస్క్యూ టీమ్ అవిశ్రాంత అంకితభావ ప్రయత్నాలతో రాహుల్ సాహు క్షేమంగా బయటపడ్డాడు. బాలుడు వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు.