ఏపీలో నిత్యం ఏదో ఒకచోట పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం, మాస్ కాపీయింగ్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరులో పదవ తరగతి లెక్కల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం సెల్ ఫోన్ లో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం పరీక్ష జరుగుతున్న సమయంలో ఓ యువకుడు ఎగ్జామ్ హాల్‌లో పరీక్ష రాస్తున్న తన స్నేహితులకు చిట్టీలు వేసేందుకు ప్రయత్నించాడు. పరీక్ష నిర్వహిస్తున్న సెంటర్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండడం అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్సై కంట పడింది. ఎస్సై ఆ యువకుడిని పట్టుకొని గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. అతని సెల్ ఫోన్ లో మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ కనిపించడంతో అవాక్కైన ఎస్సై వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి ఆలూరు సర్కిల్ ఆఫీస్ లో విచారణ చేపట్టారు. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీకైంది? దీని వెనుక ఎవరెవరున్నారు కోణంలో ఎంక్వయిరీ చేస్తున్నారు.
ఈ ఏడాది ఏపీలో పదవ తరగతి పరీక్షా పత్రాలు లీకవడం ఇదే తొలిసారి కాదు. కృష్ణాజిల్లా డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు మాస్ కాపీయింగ్ వెలుగుచూసింది. కొందరు ఉపాధ్యాయుల వద్ద ఇవాళ జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఈవో విచారణ జరుపుతున్నారు. ఇక నంధ్యాలలోని నందికొట్కూరులో టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్సీ శృతి వెల్లడించారు. అరెస్టైనవారిలో శ్రీనంవనది హైస్కూల్‌కు చెందిన ముగ్గురు టీచర్లు ఉన్నారని ఆమె తెలిపారు.