రేపటినుంచే 10వ తరగతి పరీక్షలు.. 5 నిమిషాలే ప్రవేశం - MicTv.in - Telugu News
mictv telugu

రేపటినుంచే 10వ తరగతి పరీక్షలు.. 5 నిమిషాలే ప్రవేశం

March 15, 2019

రేపటినుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఈ ఏడాది మొత్తం 5,52,302 (2,55,318 మంది బాలురు; 2,52,492 మంది బాలికలు) మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.రెగ్యులర్‌ కేటగిరీ కింద 5,07,810 మంది విద్యార్థులు, ప్రైవేటుగా 44,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.

10th grade tests tomorrow .. 5 minutes entry.

ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8.45 సమయానికి హాల్ టికెట్‌తో పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత.. 5 నిమిషాలపాటు పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. కాగా 9.35 గంటల అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష కేంద్రాల వరకు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి కల్పించింది.

విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని 116 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఓఎంఆర్‌షీటును పరిశీలించి, ఆ పత్రం తమదే అని నిర్ధారించుకున్న తర్వాతే జవాబులు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 2తో పరీక్షలు ముగియాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 22న జరగాల్సిన ఇంగ్లిష్‌ పేపర్‌-2 పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న విషయం తెలిసిందే.