పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న నగదు మరికాసేపట్లో వారి వారి అకౌంట్లలో జమ కానుంది.యాసంగి సీజన్‌కు సంబంధించి పదో విడత రైతుబంధు నగదును నేటి నుంచి నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనుంది. తొలిరోజు ఎకరంలోపు రైతులకు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్హులైన చివరి రైతు వరకు రైతుబంధు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఈ సీజన్లో 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.7,676.61 కోట్లు సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ సీజన్లో 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు. గత తొమ్మిది విడతల్లో కలిపి మొత్తం రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశామని, ప్రస్తుతం పంపిణీ చేయనున్న పదో విడతతో కలిపితే ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరుతుందని చెప్పారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందించాలని ఇటీవల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.