అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్.. 

October 23, 2020

11 Indian Students Arrested in America

అమెరికాలో 11 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. తమ దేశంలో అక్రమంగా జీవిస్తున్నారనే అభియోగంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులను అరెస్ట్ చేయగా, వీరిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ  పేర్కొంది.  వీసా వ్యవస్థలో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చట్టపరంగా వారిపై చర్యలు ఉంటాయని అన్నారు.  కొన్ని ఏజెన్సీలు కూడా విద్యార్థులను మోసం చేస్తున్నాయని గుర్తు చేశారు. 

వివిధ దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఒక ఏడాది పాటు పనిచేసేందుకు  ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) కల్పిస్తుంది. స్టెమ్‌ ఓపీటీలో ఉంటే మరో 24 నెలలు పని చేయవచ్చు. కానీ ఇటీవల అరెస్ట్ అయిన వారంతా ఎక్కడా ఉద్యోగం చేయడం లేదని అధికారులు గుర్తించారు. వీరంతా అక్రమంగా ఉంటున్నారని తేల్చారు. హ్యూస్టన్‌ హ్యారిస్‌బర్గ్‌, బోస్టన్‌‌, పిట్స్‌బర్గ్‌, వాషింగ్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేశారు.  

వీసాల రద్దుతో రూ.7 లక్షల కోట్ల నష్టం :  

మరోవైపు అమెరికా వచ్చే వారి వీసాలను రద్దు చేయడంతో ఆ దేశంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు కొత్తగా హెచ్‌-1బి, ఎల్‌ -1 వీసాలపై ఆంక్షలు విధిస్తూ.. జూన్‌ 22న ట్రంప్‌ సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల అక్కడి ఐటీ కంపెనీలు దాదాపు రూ.7 లక్షల కోట్లు నష్టపోయే ఆస్కారం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  దాదాపు 500 కంపెనీలపై ఈ ప్రభావం ఉంటుందని బ్రోకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ అంచనా వేసింది. 2 లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికా రాకుండా పోయారని పేర్కొంది.